Revanth Reddy | హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఇటీవల ఎస్బీఐ భూమిని ప్రభుత్వం వేలం వేయ డం, దానిపై బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే! ఎస్బీఐ అధికారులు కోర్టును ఆశ్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి రగిలిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఎస్బీఐ నుంచి ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు ఎ స్బీఐ ద్వారా లావాదేవీలు జరుపరాదని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ మేరకు అన్ని శాఖలకు ఆర్థిక శాఖ నుంచి కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ సూచనలు వెళ్లినట్టు సమాచారం. ఇందులో భా గంగా ఎన్ని డిపాజిట్లు ఆయా శాఖల వద్ద ఉన్నాయన్న సమాచారాన్ని తమకు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతోపాటు కొత్తగా ఎస్బీఐలో డిపాజిట్లు చేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని కూడా అన్ని శాఖలకు సమాచారం పంపారని సమాచారం. రాష్ట్ర ప్రభు త్వం ఎబ్బీఐ నుంచి డిపాజిట్లను ఉపసంహరిస్తున్నట్టు వస్తున్న అనధికారిక లీకులపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. డిపాజిట్లు ఇతర బ్యాంకుల్లోకి మార్చడం ఇంకా మొదలుకాలేదని ఓ అధికారి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ప్రభుత్వం డిపాజిట్లు, ఇతర లావాదేవీలను మరో బ్యాంకుకు మార్చాలని భావిస్తున్నదని, అయితే అధికారిక ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు.
సీఎస్‌తో ఎస్బీఐ అధికారుల భేటీ
సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఎస్బీఐ రాష్ట్ర ప్రతినిధి బృందం భేటీ అయింది. సీజీజీలో జరిగిన ఈ సమావేశంలో ఎస్బీ ఐ చీఫ్ జనరల్ మేనేజర్‌తోపాటు రాష్ట్రంలోని ఆ బ్యాంకు ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. తమకు గతం లో ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రస్తుత ప్రభు త్వం వేలం వేసిందని, తమ వాదనను సీఎస్ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.