చేర్యాల, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ సర్కార్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. 2014 నుంచి దేవాలయాల్లో జరిగిన నియామకాలపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్తున్నది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ శ్రీధర్ పేరిట రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు మెమో జారీఅయ్యింది. జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ దేవాలయాలతో పాటు 6(ఏ), 6(బీ), 6(సీ) క్యాడర్ దేవాలయాల్లో 2014 నుంచి 2023 వరకు జరిగిన నియామకాల వివరాలను రెండు రోజుల్లో వెల్లడించాలని దేవాదాయశాఖ ఆదేశించింది.
పనిచేస్తున్న ఆలయం, దాని హోదాతోపాటు ఉద్యోగి పేరు, ఎప్పుడు నియమితులయ్యారు? సదరు ఉద్యోగి వేతనం ఎంత? కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం సదరు ఆదేశాల్లో కోరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్కారు దేవాదాయశాఖకు దేవాలయ ఉద్యోగుల నియామకాలపై ఆరాతీయడంతో వివిధ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో నియమితులైన ఉద్యోగుల వివరాలు తెలుసుకోవడం వెనుక మతలబు ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు.