ఏ జీవి ప్రాణమైనా గాల్లో దీపమసొంటిది. ఎప్పుడు ఆరిపోతదో ఎవరికీ తెలువదు. క్షణం మారేలోపు మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. రోడ్డుపొంటి పోతుంటే ప్రమాదం జరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడవచ్చు. ఉన్నకాన్నేగుండెపోటు వచ్చి కుప్పకూలి పోనూవచ్చు. ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరణాలకు, ప్రమాదాలకు పేద, పెద్దా అని తేడా ఉండదు. పెద్దోళ్లకు ప్రమాదం ఏర్పడినప్పుడు పైసలు వెట్టి ఏదో రకంగా తమ మనిషినికాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదృష్టం మంచిగుంటే ఆ రోగి బతికి బయటపడవచ్చు కూడా. ఎటొచ్చీ కష్టమంతా పేదోళ్లకే. ఉన్నట్టుండి ఓ పేద మనిషికి రోడ్డు ప్రమాదమో, లేకుంటే పెద్ద రోగమో వస్తే ఎవరు దిక్కు?తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పేద ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. కాబట్టే మానకొండూరు వెంకటేశ్ బతికి బట్టకట్టిండు. సిరికొండ వాసి డాకూరి రాజుకు ఇబ్బంది లేకుండా డయాలసిస్ జరిగిపోతున్నది. హవేలీ ఘన్‌పూర్‌కు చెందిన ప్రియాంక రేపో మాపో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది.
2014, జూన్ 1 వరకు
ప్రైవేట్ దవాఖానోళ్లు పాసివోయింది వెట్టినా రోగులకు అదే పరమాన్నం. సర్కార్ దవాఖానోళ్లు మంచి బువ్వ వెట్టినా రోగులకు ‘ఎహ్హె… అది నిన్నటిదో, మొన్నటిదో!?’ అనే అనుమానం. ‘సర్కారు’ అంటేనే ప్రజల్లో ఈ రకమైన ఈసడింపు, ఏవగింపు రావడానికి ప్రధాన కారణం గత అరువై ఏండ్ల ఉమ్మడి పాలకుల తీరు, తెలంగాణ పట్ల వారి వివక్ష. ఇలా.. ఆంధ్రా పాలకులు అన్నిరంగాల్లో పక్షపాతంగా వ్యవహరించినా.. వైద్య రంగంపై చూపిన కక్షపూరిత ధోరణి కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు.
‘ప్రాణం కన్నా భూమి, జాగలు ముఖ్యమా? నెత్తురు పంచుకు వుట్టిన బిడ్డ కన్నా పైసల్ ముఖ్యమా!?’ అని తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు, రోగి బంధువులు.. ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకొనైనా ప్రాణాన్ని కాపాడుకునేటందుకు ముప్పుతిప్పలు వడేటోళ్లు. అప్పో సప్పో జేసి ఆపదలో ఉన్న రోగిని కాపాడుకునే ప్రయత్నం జేసేటోళ్లు. సర్కారు దవాఖాన్ల పట్టించుకునే దిక్కులేక లక్షలు ధారబోసి ప్రైవేటు దవాఖానకు పోయేటోళ్లు. అయినా ఆ ‘ప్రాణం’ నిలబడుతుందా, లేదా అంటే అదీ నమ్మకం లేదు.
మచ్చుకు ఒక ఉదాహరణ..
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోన సముంధర్ గ్రామానికి చెందిన గమ్మత్ ఆశన్న బీడీల కార్ఖానాలో కమీషన్ ఏజెంట్. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. సర్కారు దవాఖాన్లకు ఏస్కవోతే డాక్టర్లు మంచిగ సూత్తరో, సూడరో.. మా నాన్న బతుకుతడో, బతుకడోనన్న అనుమానంతోని ఆయన కొడుకులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానల షరీఖ్ జేసిండ్రు. రెండ్రోజుల తర్వాత.. 2007 ఆగస్టు 26 రోజున ‘మా ప్రయత్నం మేం జేసినం గని, మీ నాన్న బతుకలేదు. బిల్లు గట్టి బాడీ తీస్కపోర్రి’ అని డాక్టర్లు చేతులెత్తేసిర్రు. పాపం ఆశన్న కొడుకులకు ఏం జేయాల్నో తెల్వక రూ.3 లక్షల అప్పుజేసి మరీ శవాన్ని ఇంటికి తీస్కచ్చుకున్నరు. ఇటు మనిషే బతుకలేదంటే, అటు పైసల్ గూడ మస్తు కర్సయినయి. తీసుకొచ్చిన అప్పు కుప్పలై గూసుంది. ఇప్పటికీ ఆ అప్పు మీద మిత్తీ కడుతనే ఉన్నమని ఆయన కొడుకులు వాపోతున్నరు.
అప్పట్లో ప్రైవేట్ దవాఖానలు కాసులతో కళకళలాడుతుంటేపీహెచ్సీలు, సీహెచ్‌సీలు.. ఎక్కడికి వోయినా రోగులు లేక ప్రభుత్వ దవాఖానలు వెలవెలబోయినయి. చికిత్స అట్లుండేది మరి. బహుశా ‘కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊసిపోయిందట’ అనే సామెత అప్పటి సర్కారు దవాఖానల పనితీరు చూసే వాడుకలోకి వచ్చిందేమో. రోగులు కూడా ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అని మొర పెట్టుకున్నరేమో! సర్కారు దవాఖానకు పోతే శవంతో, ప్రైవేటు దవా ఖానకు పోతే శవంతోపాటు అప్పూ ఇంటికొచ్చుడు ఖాయమన్నమాట.
2014 జూన్ 2 తర్వాత
తెలంగాణ సర్కారు ప్రజారోగ్యంపై శ్రద్ధపెట్టింది. ప్రభుత్వ దవాఖానల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టిసారించింది. పేదలకు మెరుగైన చికిత్స అందించేందుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా దవాఖానల్లో సకల వసతులూ కల్పించింది. సర్కార్ దవాఖానల రూపురేఖలు మారడమే కాదు, వాటిలో అందించే చికిత్స కూడా ఆధునికతను సంతరించుకున్నది. కాబట్టే ప్రజలు పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా దవాఖానలకు క్యూ కడుతున్నారు.
మచ్చుకు ఒక ఉదాహరణ.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్ కరీంనగర్లో రెండు గీరల బండి నడుపుతూ కిందపడిపోయిండు. మిగతా శరీరం మీద ఏ చిన్న దెబ్బ తగలకపోయినా తలకు మాత్రం బలమైన గాయమైంది. స్థానికులు కరీంనగర్‌లోని జిల్లా దవాఖానకు తరలించిండ్రు. గాయం పెద్దది కావడంతో అక్కడి డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిండ్రు. వెంకటేశ్ తల్లిదండ్రుల (లచ్చన్న-లత)ది రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం. దంపతులిద్దరూ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో వంటపని చేసుకుంటా జీవితం ఎల్లదీస్తరు. వెంకటేశ్‌కు ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ల చేతిలో చిల్లి గవ్వలేదు. హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో వెంకటేశ్‌కు బ్రెయిన్ ఆపరేషన్ అయి దాదాపు 10 రోజులు కావస్తున్నది. ‘పదో, పరకో బయటి ఖర్చులే తప్ప ఇప్పటివరకు మా చేతుల మీద దవాఖానల రూపాయి కూడా బిల్లు కట్టలేదు’ అని వెంకటేశ్ తల్లి లత చెప్పుకొస్తున్నది. తన కొడుకు మంచిగై మళ్లా ‘అమ్మా…’ అని పిలుస్తడనే భరోసాతో ఉన్నది ఆ తల్లి. ఇలాంటి ఉదాహరణలు అనేకం.
ఇట్లా నేడు సర్కారు దవాఖాన్లకు ఉశ్కె వోత్తె రాలనంత రోగులు వస్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా దవాఖానలు.. ఏ మూలకు వోయినా రోగులు బారులు తీరుతున్నరు. ఎందుకంటే అక్కడ అద్భుతమైన చికిత్స అందుతున్నది. ఇంకేముంది, రోగులు ‘పోదాం పదా సర్కారు దవాఖానకు’ అంటూ గుండెనిండా ఆశతో బయల్దేరుతున్నరు.

Govt Hospitel1
ఊహించని ఉపద్రవం
2020 కొవిడ్ మహమ్మారి. ఈ భీకరమైన వ్యాధి వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిండ్రు. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డయి. ఓ దిక్కు పిట్టల్లా మనుషులు రాలిపోతుంటే కనికరం లేకుండా కరోనా వ్యాధిని సొమ్ము చేసుకున్నయి. ప్రైవేట్ దవాఖానలు. కరోనా నుంచి రోగుల ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు పేదల్ని అక్కున చేర్చుకున్నయి. నిజామాబాద్ జిల్లా దవాఖానను తీసుకున్నట్లయితే.. కరోనా రోగులతో దవాఖాన మొత్తం నిండిపోయింది. ఈ జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో సంబంధం ఉంటుంది. కరోనా తాకిడిని తట్టుకోలేక మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఆయా రాష్ర్టాల కరోనా రోగులను కూడా ఆదుకున్నదీ దవాఖాన. నిజామాబాద్ జిల్లా రోగులు 60 శాతం మంది షరీఖైతే ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు 40 శాతం మంది.. తమ ప్రభుత్వాలపై నమ్మకం లేక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈ దవాఖానలో షరీఖ్ అయ్యిండ్రు. ఎంతోమందికి పునర్జన్మనిచ్చిన ఈ దవాఖాన సిబ్బందికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘ప్రభుత్వం ఆ సమయంలో గొప్ప సంకల్పంతో పనిచేసింది. నిధుల మంజూరులో వెనక్కి తగ్గలేదు. సౌకర్యాల విషయంలో రాజీపడలేదు’ అంటున్నరు అక్కడి డాక్టర్లు.
ఆదర్శం.. ఈ పీహెచ్సీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పాత గోడలతో మాసిపోయిన వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తరూపు సంతరించుకున్నది. ఈ పీహెచ్‌సీని చూసిన కొత్త వారెవ్వరైనా.. ‘ఇది కార్పొరేట్ దవాఖాననా?’ అని కచ్చితంగా అడుగుతారు. ఆ స్థాయిలో ఉంటుందీ పీహెచ్సీ. బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూరు మండల కేంద్రంలో ఉన్న ఈ పీహెచ్సీలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు, పాముకాటు, కుక్కకాటు, కోతికాటుకు 24 గంటలు మందు అందుబాటులో ఉంటుంది. ‘తన వేలుకు చిన్న గాయమైనా సరే చిన్న పిల్లాడు కూడా బాజాప్తా వచ్చి మేడం నాకు టీటీ ఇవ్వండని మరీ సూది వేయించుకొని పోతాడు. మండలంలోని ప్రతి గ్రామానికో ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, ఎంఎల్‌హెచ్‌పీ అందుబాటులో ఉంటారు’ అని డాక్టర్ నాగమణి చెప్తున్నారు.
ఈ ఫొటోలోని బండి ప్రియాంక మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలానికి చెందిన గంగాపూర్ నివాసి. ప్రియాంక తండ్రి చిన్నతనంలోనే కాలం జేసిండు. ప్రియాంకకు పెండ్లయినంక రెండు నెలలకే తల్లి దేవమ్మ రోడ్డు ప్రమాదంలో దేవుని దగ్గరికి వోయింది. దేవమ్మ చెల్లె పేరు భాగ్య. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం యాడారం గ్రామానికి చెందిన భాగ్య దగ్గరికి ప్రియాంక ఎందుకు వచ్చిందంటే..? ప్రియాంకకు ఇప్పుడు ఏడో నెల. సెంట్రింగ్ పనిచేసే తన భర్త రాము మెదక్ జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలో ప్రియాంకను నెలనెలా చూపిస్తున్నడు. అందుకోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నడు. ఖర్చవుతున్నా ఫర్వాలేదు కనీ చికిత్స బాగుండాలని రాము కోరిక. కానీ అక్కడి చికిత్స ప్రియాంకకు నచ్చడం లేదు. అందుకే నెలనెలా తన చిన్నమ్మ భాగ్య దగ్గరికి వస్తున్నది. కామారెడ్డి జిల్లా దవాఖానలో నెలనెలా చికిత్స చేయించుకుంటున్నది. ప్రైవేటు దవాఖానలో చికిత్స కన్నా.. ఇక్కడే తనకు మంచి చికిత్స అందుతున్నదని సంబురంగా చెప్తున్నది ప్రియాంక. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ మొహంలో తన తల్లి దేవమ్మను చూసుకోవాలని ఆరాటపడుతున్నది.

Govt Hospitel2
గజ్జానాయక్ తండా..
ఈ ఫొటోలో కనపడుతున్న అవ్వ పేరు లౌడియా జంలీ.. ఈ అవ్వ సారు పేరు గజ్జానాయక్. ఆయన పేరు మీదనే ఈ తండా ఏర్పడ్డది. గజ్జానాయక్-జంలీ దంపతులకు 9 మంది సంతానం. ‘ఎంత వయస్సుంటదవ్వా నీకు?’అని అడిగితే ఎనభై పైన ఉంటదని చెప్తున్నది. ఇంతకూ ఈ అవ్వ గురించి ఎందుకు చెప్తున్నమో తెలుసా? మాచారెడ్డి పీహెచ్సీ నుంచి రోజూ వచ్చే ఏఎన్ఎం ఈ అవ్వను చూసి షాక్ అవుతుందటా! ఈ ముసలవ్వలో సగం వయస్సున్న వ్యక్తులకు బీపీ, షుగర్ గోలీలిచ్చే ఆ ఏఎన్ఎం.. జంలీ ముసలవ్వ బీపీ చూసి ‘శభాష్!’ అంటుందంట. ‘నీ ఆరోగ్యం మంచిగుందా అవ్వా?’ అని నేనడిగితే.. రెండు మూడు బస్కీలు తీసి మరీ సూపెట్టింది జంలీ తల్లి. ‘అవ్వా.. నీ బల్గం ఎంత?’ అనడిగితే 2 యాటలు గోసినా నా బల్గానికి సాలదని బోసి పండ్లతో నవ్వుతూ చెప్పింది.
వారానికి మూడు సార్లు..
గల్ఫ్‌కు పోయి వచ్చిన. నేను గత ఏడేండ్లుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకుంటా. మొదట హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో సైకిల్‌కు రూ.3 వేలు పెట్టి డయాలసిస్ చేసుకున్నా. అంటే వారానికి 12 వేలు, నెలకు సుమారు యాభై వేలు. ఒక దశలో ఇన్ని డబ్బులు పెట్టి డయాలసిస్ చేయించుకోవడం కన్నా చావే నయమనుకున్నా. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ చేస్తున్నదని తెలిసి సంతోషపడ్డా. ఇప్పుడు కామారెడ్డిలో వారానికి మూడుసార్లు ఉచితంగా డయాలసిస్ చేస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
-డాకూరి సత్యనారాయణరాజు, డయాలసిస్ రోగి, సిరికొండ, నిజామాబాద్ జిల్లా
అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో!
అమ్మతనం ఏ తల్లికైనా ఓ మధురానుభూతి. ఏ మహిళ అయినా అమ్మ అవుతుందని తెలిస్తే చాలు 102 వాళ్లింటి ముందు వాలిపోతుంది. నెలా నెలా ఆ గర్భిణిని దవాఖానకు తీసుకురావడం, చికిత్స తర్వాత మళ్లీ ఇంటికాడ దించడం ‘అమ్మ ఒడి’ వాహనం చేసే పని. డెలివరీ అయ్యే దాన్కనే కాదు, ఆ తర్వాత 6 నెలల దాన్క ప్రతి తల్లీబిడ్డకు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. ‘కేసీఆర్ కిట్‌ను చూసి తల్లీబిడ్డలు మురిసే తీరు నన్ను ఆకట్టుకుంటుంది. గర్భిణులకు సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వానికి శనార్థులు’ అని చెప్తున్నాడు అమ్మ ఒడి వాహన డ్రైవర్ వెంకట్.
పరాయి పాలనలోని ప్రభుత్వ దవాఖానలో రోగికి పెట్టే భోజనం అంతంత మాత్రమే ఉండేది. ఎందుకంటే ఆంధ్రా పాలకులు రోగి పేర రోజుకు రూ.40 మాత్రమే చెల్లించేవారు. దీంతో
కాంట్రాక్టర్ నీళ్ల చారు, పలుచటి పప్పుతో ‘మమ!’ అనిపించేవాడు. అది బాగోలేక రోగులు వాంతులు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత భోజనం నాణ్యత పెరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికి రోజుకు రూ.80 చెల్లిస్తున్నది. దీంతో ఆహారం కమ్మగా, రుచిగా ఉంటున్నది. రోజుకు నాలుగు కూరలతో వండాలని, ఆ భోజనాన్ని నేను తిన్న తర్వాతే పేషంట్లకు పెట్టాలని నిబంధన విధించాను. అదే రోజూ అమలవుతున్నది.
-డాక్టర్ ప్రతిమా రాజిరెడ్డి , సూపరింటెండెంట్
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ,నిజామాబాద్
…? గడ్డం సతీష్
జి.చిన్న యాదగిరిగౌడ్