రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 5: కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ప్రభుత్వం ఎట్టకేలకు అన్నపూర్ణ జలాశయానికి విడుదల చేసింది. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖతో రాష్ట్ర సర్కారు స్పందించింది. సిద్దిపేట అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి సాగునీరివ్వాలని శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాయగా.. ఆదివారం సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పందించారు.
మిడ్‌మానేరు ద్వారా సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తామని చెప్పినట్టుగానే సోమవారం నుంచి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఎత్తిపోతలను ప్రారంభించారు. బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా.. ఇక్కడి పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేశారు. ఒక్కో మోటర్ ద్వారా 3,220 క్యూసెక్కుల చొప్పున 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి తరలిస్తున్నట్టు ఏఈ సమరసేట తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి నీటిని విడుదల చేయాలని కోరిన మూడు రోజులకే ప్రభుత్వం స్పందించడంతో రైతులు సంబురపడుతున్నారు.