రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చేనేత పథకాలకు రూ.110 కోట్లు కోత విధించింది. గత ఏడాదిలో పెట్టిన బడ్జెట్లో రూ.368 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రూ.258 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తే.. చేనేత కార్మికుల నోట్లో మట్టి కొట్టినట్టుగా భావిస్తున్నారు. బడ్జెట్లో కేటాయింపులు తగ్గడం తో వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ అటకెక్కనున్నాయి. నేత కార్మికుల కోసం భరోసా, త్రిఫ్ట్, బీమా వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. రుణాల మాఫీ, మహిళలకు రెండు చీరల పంపిణీ కేటాయింపులు బడ్జెట్లో ప్రస్తావించలేదు. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల క్వాష్ క్రెడిట్ రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెట్టుబడి సాయం కింద వడ్డీలేని రుణం తదితర పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాల్సిన అంశం కూడా బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. బడ్జెట్లో కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇస్తున్నామని, ఈ మేరకు చీరల పంపిణీ జరుగుతుంది అని గొప్పలు చెప్పారు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలకు చీరలు ఇచ్చారు అన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేక పోయారు. సిరిసిల్ల నేతన్నలపై రాష్ట్ర బడ్జెట్లో మరోసారి మొండిచేయి చూపింది. వర్కర్ టు ఓనర్ పథకంపై రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పేరిట చీరల ఆర్డర్లు అరకొరగా అందించింది.
గతం కంటే రూ.110 కోట్లు తగ్గించిన ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ మండిపడ్డారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో నిధులు పెంచాల్సింది పోయి తగ్గించారని, చేనేత కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కార్ వైఖరి మరోసారి నిరూపితమైందన్నారు.
బడ్జెట్లో ఊసేలేని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సిరిసిల్ల చేనేత ప్రస్తావనే లేకుండాపోయింది. మరమగ్గాల పరిశ్రమకు కేంద్ర బిందువుతోపాటు తొలి టెక్స్టైల్ పార్కు ఉన్న సిరిసిల్ల గురించి ప్రస్తావించలేదు. రెండున్నరేండ్లుగా ఎదురు చూస్తున్న వర్కర్ టు ఓనర్ పథకం ఊసెత్తలేదు.
సిరిసిల్లకు తీవ్ర అన్యాయం
బడ్జెట్లో సిరిసిల్లకు తీవ్ర అన్యాయం జరిగింది. రైతుల తర్వాత నేతన్నలకు 12 నెలలు పని కల్పిస్తామని చెప్పి.. బడ్జెట్లో రూ.258 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోదు. వర్కర్ టు ఓనర్ పథకానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయం. – మూశం రమేశ్,పవర్లూమ్ వర్కర్స్ యూనియన్రాష్ట్ర అధ్యక్షుడు
నేతన్నలకు మొండిచేయి
రాష్ట్ర బడ్జెట్లో నేతన్నలకు మళ్లీ మొండిచేయి చూపించింది. కేసీఆర్ సర్కార్ పెట్టిన సంక్షేమ పథకాలపై నిర్ణయం తీసుకోలేదు. రూ.388 కోట్ల తో పెట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. సిరిసిల్ల నేతన్నలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది.
– వెంగళ శ్రీనివాస్, బీఆర్టీయూ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు