హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాంగ్రెస్ సర్కార్ తమ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకునేందుకు, ఆధిపత్యం చెలాయించేందుకు అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేండ్లుగా ఇన్చార్జ్ సీఎండీలను నియమించడమే ఇందుకు నిదర్శనమని కార్మిక సంఘా లు ఆరోపిస్తున్నాయి. తమ ఆధిపత్యం కోసం, పట్టు కోసం రెగ్యులర్ ఐఏఎస్‌లను సీఎండీలుగా నియమించడంలేదని విమర్శిస్తున్నాయి. అర్హత కలిగిన అత్యున్నత అధికారిని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సంస్థలో డైరెక్టర్ (ఫైనాన్స్) పోస్టు నెల రోజులుగా ఖాళీగా ఉన్నది. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ పోస్టును ఖాళీగా ఉంచడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
రెండేండ్లుగా ఇన్‌చార్జ్‌ల పాలన
ప్రభుత్వంలో కొన్ని చిన్న సంస్థలున్నాయి. ఆయా సంస్థలకు ప్రభుత్వం రెగ్యులర్ ఐఏఎస్‌లను సీఎండీలుగా నియమించింది. ట్రాన్స్‌కో, జెన్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ వంటి సంస్థలకు కూడా రెగ్యులర్ ఐఏఎస్‌లే సీఎండీలుగా ఉన్నారు. కానీ, సింగరేణి విషయంలో మాత్రం రెండేండ్లుగా ఇన్చార్జ్ సీఎండీలతోనే నడిపిస్తున్నది. దీనిపై కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా సీనియర్ ఐఏఎస్‌లే సంస్థకు సుదీర్ఘ కాలం సేవలందించారు. ఎస్ నర్సింగరావు 2006 నుంచి 2012 వరకు, సుదీర్థ భట్టాచార్య 2012 నుంచి 2014 వరకు, ఎన్ శ్రీధర్ 2015 నుంచి 2023 వరకు సీఎండీలుగా పనిచేశారు. సుదీర్థ భట్టాచార్య, నర్సింగరావులైతే ఏకంగా కోలిండియా చైర్మన్లుగానూ పనిచేశారు. సింగరేణిని నడిపించిన తీరుతోనే వారు ఆయా స్థానాలకు చేరుకోగలిగారు. ఎన్ శ్రీధర్ కూడా ఎన్ఎండీసీ చైర్మన్ పోస్టు కోసం పోటీపడ్డారు. శ్రీధర్ తర్వాత సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఎన్ బలరాంకు 2023 డిసెంబర్ 31న కాంగ్రెస్ సర్కార్ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 2025 డిసెంబర్ రెండో వారం వరకు ఆయనే సీఎండీగా సేవలందించారు. ఆయన డిప్యుటేషన్ గడువు ముగియడంతో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌కు ఇన్చార్జ్ సీఎండీగా బాధ్యతలు అప్పగించింది.
పెరిగిన పెత్తనం
ఈ రెండేండ్లలో సింగరేణిపై సర్కార్ పెద్దల పెత్తనం పెరిగిందని, ప్రతి విషయంలో సర్కార్ అతి జోక్యం తారస్థాయికి చేరిందని కార్మిక సంఘాలు ఆ రోపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ నేతలు, ప్రజాప్రతినిధులు సింగరేణిలో జోక్యం చేసుకోవడం తానెప్పుడూ చూడలేదని, ఈ రెండేండ్లలోనే ఎక్కువైందని సర్కార్‌కు దగ్గరగా ఉండే ఓ కార్మిక సంఘం నేత వ్యాఖ్యానించారు. సంస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే మూడేండ్లలో సంస్థను సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికుల శ్రమను అడ్డగోలుగా దోచుకుంటుంటే తమ కడుపు మండిపోతున్నదని పేర్కొన్నారు.
తెరపైకి ఓ మహిళా ఐఏఎస్ పేరు
గతంలో ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ పేరు సింగరేణి సీఎండీ పోస్టు కోసం తెరపైకి వచ్చిం ది. ఉత్తర్వులు రావడమే ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే, ఆమె భర్త ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అప్పటికే సింగరేణిపై పట్టు కో సం ఇద్దరు ముఖ్య, గట్టి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమె వస్తే, మూడో కోటరి తయారవుతుందని, తమ అదుపులో ఉండదని, ఇది తమకు ఇబ్బంది అని భావించి సర్కార్ పెద్దలు ఈ ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టినట్టు సంస్థలోనే ప్రచారం జరుగుతున్నది. ఇటీవల కూడా రెగ్యులర్ సీఎండీని కాకుండా ఇన్చార్జ్ సీఎండీని నియమించడం వెనుక ఇదే జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇప్పట్లో రెగ్యులర్ సీఎండీని నియమించే అవకాశాలు కనిపించడంలేదని సింగరేణి వర్గాలంటున్నాయి. ఇప్పుడున్న సీఎండీ కృష్ణభాస్కర్ ట్రాన్స్‌కో సీఎండీగా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు.