Rythu Runa Mafi | హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. కానీ, వాటికి జవాబులే దొరకడం లేదు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలు రైతుల్లో అనేక భయాలు, గందరగోళం సృష్టిస్తున్నాయి.
రేషన్‌కార్డు లేని వారి పరిస్థితి ఏమిటి?
రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబాన్ని లింకు చేసి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రేషన్‌కార్డుల్లో పేరు ఉన్నవారికి కొంత నష్టం జరిగినా, ఎంతో కొంత అప్పు తీరుతుంది. అయితే, రేషన్‌కార్డు లేని వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు రైతులు పంట రుణం తీసుకున్నారు. కానీ, వారికి రేషన్‌కార్డు లేదు. ఇప్పుడు వారిని ఏ విధంగా గుర్తిస్తారు? వారికి రుణమాఫీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నకు జవాబు లేదు.
గోల్డ్‌లోన్ రుణమాఫీ లేనట్టే
రైతులు పంట సాగు కోసం బ్యాంకుల్లో పాస్బుక్లతోపాటు బంగారాన్ని తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటారు. దీనిని కూడా బ్యాంకులు పంట రుణం కిందనే భావిస్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తరహా రుణాలను కూడా మాఫీ చేసింది.కాంగ్రెస్ ప్రభు త్వం పాస్‌పుస్తకాలతోపాటు బంగారాన్ని తాక ట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయడం లేదు. బంగారంపై తీసుకున్న రుణాల మాఫీపై నిబంధనల్లో ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధంగా ఆ రైతులకు రుణమాఫీలో ప్రభుత్వం మొండి చెయ్యి చూపినట్టే.
ఆరోహణ క్రమం అంటే.. ?
ఆరోహణ క్రమంలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అంటే తక్కువ నుంచి ఎక్కువకు రుణమాఫీ చేస్తుంది. అయితే దీనిపై నిబంధనల్లో స్పష్టత ఇవ్వలేదు. తొలుత ఎంత మొత్తం నుంచి రుణమాఫీ మొదలు పెడుతుంది? ఎప్పటి నుంచి మొదలుపెడుతుంది? ఎప్పటి వరకు పూర్తి చేస్తుంది? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. అరోహణ క్రమంలో అంటే ఎంతెంత మొత్తం ఎప్పుడు చేస్తారో స్పష్టత లేదు.
ఎక్కువ రుణం చెల్లించిన తర్వాతే రుణమాఫీ
ఒక కుటుంబానికి రూ.2 లక్షల కన్నా ఎక్కువ రుణం ఉంటే.. ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలని షరతు పెట్టింది. రైతులు ఆ డబ్బులు చెల్లించిన తర్వాతే రూ.2 లక్షలు మాఫీ చేస్తామని స్పష్టంచేసింది. ఈ నిబంధన రైతులపై భారాన్ని మోపడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రైతు రూ.3 లక్షల రుణం తీసుకున్నట్టయితే, ఆ రైతు రుణమాఫీకి ముందే రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించడం రైతుకు ఇబ్బందే. అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షలకు మించినా ఇదే నిబంధన వర్తిస్తుందా? అనే సందేహాలున్నాయి. నిర్దిష్ట రుణం ఎక్కువ మొత్తాన్ని రైతులు చెల్లించారో లేదో తెలుసుకునేందుకు మరో జాబితా తెప్పించుకోవాలి. ఇది రుణమాఫీని ఆలస్యం చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వం చేసే మాఫీకి, అదనపు మొత్తం చెల్లింపులకు లింకు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.