‘సినిమా టికెట్ రేట్లు వేలకు వేలు పెంచితే సామాన్యులు ఎట్ల బతుకుతరు? ఇగనుంచి బెనిఫిట్ షోలు లేవు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇయ్యం. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదు’ నిరుడు డిసెంబర్లో అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలివి. ఆ ముచ్చటకు వార్షికోత్సవం కూడా కాకుండానే ఆయన మాట తప్పారు. తాజాగా ‘అఖండ-2’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆడి తప్పడమే కాదు., ఆటకోసం దేన్నైనా తప్పించడమూ సీఎంకు వెన్నతో పెట్టిన విద్యే. సినిమా డైలాగ్ లను తనదైన ైస్టెల్లో పేల్చుతూ అందరితో అబ్బా& ఏం మాటల్రా.. బాబూ.. అనిపించుకోవడంలో ఉన్న ఉత్సాహం మాటలను నిలుపుకోవడంలో ప్రదర్శించకపోవడమే తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. అందుకే మాట చెప్పడం., మడమ తిప్పడం ఆయనకే చెల్లుతుందని రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. గతంలో హరిహరవీరమల్లు., ఓజీ, గేమ్ ఛేంజర్.. సినిమా విషయాల్లో వెనక్కి తగ్గి తీవ్ర విమర్శలకు గురైన ఆయన తీరు ఇప్పుడు అఖండ 2 రిలీజ్ వేళ కూడా పునరావృతం అవ్వడంతో అభిమాన ఘనమంతా దుమ్మెతిపోస్తున్నారు.
పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం ‘ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు.. సినిమావాళ్ల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారు. అది జరిగి నెలలు కూడా తిరక్కముందే హరిహరవీరమల్లు, గేమ్ ఛేంజర్, ఓజీ సినిమాల విడుదల వేళ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అవకాశం కల్పించి ‘అంతా తూచ్& మేమింతే..’ అన్నట్టుగా తనదైన మార్కును చూపించి అపకీర్తిని మూటగట్టుకున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్రప్రజలు మరోమారు గుర్తు చేసుకుంటూ అసహ్యించుకుంటున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ-2 నేడు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. అదీకాకుండా గురువారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించడం, డిసెంబర్ 5 నుంచి 7 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునేందుకూ రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. దీంతో సర్కారు నిర్ణయంపై సినీ ప్రేమికులు భగ్గుమంటున్నారు. నాడు ప్రిమియర్ షోలకు అనుమతిచ్చే ప్రసక్తేలేదని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతం లో సమైక్య పార్టీలో పనిచేసిన సందర్భంలో ఆం ధ్రాకు చెందిన నేతలతో ఉన్న సఖ్యత, వారి ఒత్తిడితోనే అఖండ-2 బెనిఫిట్ షోకు అనుమతిచ్చారని బహిరంగంగానే దుయ్యబడుతున్నారు.