హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రెవెన్యూ(విపత్తుల నిర్వహణ)శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన తన కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. జూన్ 2 నుంచి 30 వరకు వ్యక్తిగత సెలవులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఏప్రిల్ 15న నాటి సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో అప్పటి రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అర్వింద్‌కుమార్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని కాంగ్రెస్ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అర్వింద్‌కుమార్ కనిపించకుండా పోయారని భువనగిరి ఎంపీ చామాల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రభాకర్‌రావు మాదిరిగానే అర్వింద్‌కుమార్ కూడా విదేశాలకు వెళ్లినట్టు గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొనడం గమనార్హం. ఫార్ములా రేసుపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు అర్వింద్‌కుమార్‌పై బట్టకాల్చి మీద వేయడం చర్చనీయాంశంగా మారింది.