హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): శనగల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. మార్క్‌ఫెడ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కోటా కింద 58 వేల టన్నుల శనగలు కొనుగోలు చేసింది. ఇంకా మార్కెట్లకు శనగలు వస్తుండటంతో కోటా పెంచాలని కేంద్రాన్ని కోరగా.. నిరాకరించింది. దీంతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో మొత్తం శనగల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
యాసంగిలో 3.77 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగైంది. 2.55 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. శనగలకు రూ.5,230 మద్దతు ధర ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.5 వేల లోపే పలుకుతున్నది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తీసుకొస్తున్నారు.