హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బిల్లులు తెచ్చుకోండి, కమీషన్లు పుచ్చుకోండి, అంతేగానీ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు మాత్రం అడగొద్దు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదేనా? అభివృద్ధి పనుల కోసం ఏటా నియోజకవర్గానికి రూ.10 కోట్లు అంటూ విడుదల చేసిన జీవోను పక్కన పడేసిందా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసేవ కంటే కమీషన్ల వైపే మెగ్గు చూపుతున్నారా? అంటే సచివాలయ వర్గాలు నిజమే అని అంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెలకు రూ.5 కోట్ల వరకు కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు తెచ్చుకోవాలని, వాటిని క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు 8 శాతం కమీషన్‌తో బిల్లులు క్లియర్ చేయించగా, మరికొంత మంది వారి వ్యక్తిగత కాంట్రాక్టు బిల్లులు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందున్న ‘సీడీఎఫ్'(నియోజకవర్గ అభివృద్ధి నిధి) స్థానంలో ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రతీ నియోజకవర్గానికి ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జీవో వెలువడి 16 నెలలు దాటుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. చిన్నాచితక పనులకు నిధులు వచ్చినా జిల్లా ఇన్చార్జి మంత్రుల అనుమతి లేకుండా అడుగు ముందుకు పడటంలేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎల్పీ సమావేశాల్లో, సీఎంను కలిసిన సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారట. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగకపోవటంతో తాము గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రత్యేక నిధికి డబ్బులు కేటాయించాలంటే ఏటా రూ.1,190 కోట్లు అవసరం అవుతాయని, ప్రస్తుతం ఖజానా దివాలా తీసిందని, తెస్తున్న అప్పులు మిత్తీలకు కూడా సరిపోవటం లేదని, కాబట్టి నిధులు మంజూరు చేయలేమని ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేశారట.
నిధులు విడుదలైతే కాంట్రాక్టులు, కమీషన్ల రూపంలో తమ జేబులు నిండుతాయని అనుకున్న కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దల సమాధానంతో తెల్లముఖం వేశారని తెలిసింది. దీంతో వారు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. రానురాను ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వ పెద్దలు కొత్త పథకాన్ని తెరమీదికి తెచ్చారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పనులతో సంబంధం లేకుండా వారి జేబులు నింపే కార్యక్రమానికి రూపకల్పన చేశారని సమాచారం. ప్రతీ ఎమ్మెల్యే నెలకు రూ.5 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు తెచ్చుకోవాలని, వాటిని క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారట. బదులుగా 8 శాతం వరకు కమీషన్ వసూలు చేసుకోవాలని సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. జూన్ నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చిందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక దఫా కమీషన్లు కూడా అందాయని చర్చ జరుగుతున్నది.
ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆఫర్‌ను అడ్డుపెట్టుకొని దక్షిణ తెలంగాణకు చెందిన ఒక యువ ఎంపీ తనకు రూ.100 కోట్ల చొప్పున కాంట్రాక్టు బిల్లులు క్లియర్ చేయాలని ముఖ్యనేతను కోరినట్టు తెలిసింది. తన నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, రూ.35 కోట్లు చొప్పున ఇవ్వాలని చెప్పారట. ఢిల్లీ వ్యవహారాలు చూసుకునేందుకు మరికొంత ఫండ్ కేటాయించాలని ముఖ్యనేతతో చనువుగా ఉండే ఆ ఎంపీ కోరినట్టు తెలిసింది. ఆయన అభ్యర్థనను లెక్కాపద్దులు చూసే కీలక నేత పరిగణలోకి తీసుకోనట్టు తెలిసింది. అందరితోపాటు రూ.5 కోట్లే ఇస్తామని స్పష్టంచేయడంతో.. తనకు అవసరం లేదంటూ ఆ ఎంపీ వెళ్లిపోయినట్టు చర్చ జరుగుతున్నది.