హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): నూతన డీజీపీగా బీ శివధర్‌రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్టు సమాచారం. ఈనెల 30తో డీజీపీ జితేందర్ పదవీకాలం ముగియనుండగా, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఇన్చార్జి డీజీపీగా 1994వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బీ శివధర్‌రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూ పింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఆయన త్వరలోనే పోలీసు బాసుగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకు యూపీఎస్పీకి పర్మినెంట్ డీజీపీకి అర్హులైన వారి పేర్లను పంపనున్నది. ప్రభు త్వం పంపే ఆ లిస్టులో ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్న సీనియర్ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, బీ శివధర్‌రెడ్డితో పాటు డీజీ క్యాడర్ అధికారిణిగా ఉన్న అభిలాష బిస్త్ పేర్లు ఉంటాయని విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ విజిలెన్స్ కమిషన్ డీజీగా బదిలీ చేస్తారని తెలిసింది. సీనియర్ ఐపీఎస్ బదిలీల ఉత్తర్వులు ఈనెల 29లోగా వస్తాయని సమాచారం.
పలువురు సీపీలు, ఐపీఎస్‌ల మార్పు?
డీజీ ర్యాంక్‌లో కొనసాగుతున్న సీవీ ఆనంద్‌ను విజిలెన్స్‌కు పంపితే.. హైదరాబాద్ సీపీ పోస్టు ఖాళీ అవుతుంది. దీంతో సీపీగా వీసీ సజ్జనార్‌ను ఎంపిక చేస్తారని సమాచారం. రాచకొండ సీపీని కూడా మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఆర్టీసీ పగ్గాలు ఐఏఎస్‌కు?
టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా ఈసారి ఐఏఎస్ అధికారిని నియమిస్తారని సమాచారం. సంస్థకు సుదీర్ఘకాలంగా ఐపీఎస్ అధికారులే ఎండీలుగా కొనసాగుతూ వస్తున్నారు. త్వరలో జరిగే ఐపీఎస్‌ల బదిలీల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు స్థానచలనం ఖాయంగా కనిపిస్తున్నది. ఆర్టీసీ సంస్థకు సజ్జనార్ స్థాయిలోనే సమర్థవంతంగా పనిచేసే అధికారి కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అప్పటివరకు సజ్జనార్‌కే ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.