ఎదులాపురం : ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ ప్రజల వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ( DSP Jeevan Reddy) తెలిపారు. గురువారం వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని మసుధానగర్కు చెందిన మహమ్మద్ తాజ్ద్దీన్( Mohammed Tajuddin) అలియస్ షాకీర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టులో టైపిస్టుగా ( Typist ) పనిచేస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వేనంబర్29/1 ఇందిరమ్మకాలనీ, ఖానాపూర్ శివారులో ఖాళీ ప్రదేశాలను చూపించి జిరాక్స్ నకిలీ పత్రాలను వారికి అందజేసి మోసం చేసేవాడని వివరించారు.
పదుల సంఖ్యలో బాధితులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షన్నర తీసుకుని వారికి ప్రభుత్వ స్థలాలను పేరుతో ఖాళీ ప్రదేశాలను చూపించేవాడని డీఎస్పీ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో ఏడు కేసులు నమోదు ఉన్నాయని పేర్కొన్నారు. సర్వేనెంబర్ 170లో ప్రజలకు నకిలీ పత్రాలు చూపించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసులు నమోదయాయని తెలిపారు. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఇంకా ఉండవచ్చని, బాధితులు ఎవరైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.