GPO | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో గ్రామ పాలన అధికారుల (జీపీవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 10,954 విలేజ్ లెవల్ ఆఫీసర్స్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేందుకు వీరిని నియమించనున్నట్టు పేర్కొంది.
జీపీవోగా పనిచేసేందుకు గతంలో పనిచేసిన వీఆర్వో, వీఏవోల నుంచి ఆప్షన్లు కోరనుంది. ఆసక్తి చూపిన వారిని జీపీవోలుగా నియమించనుంది. దీంతో జీపీవోలుగా మళ్లీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (వీఆర్వో) రాబోతున్నారు. జీపీవోల విధివిధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే విధివిధానాలను జారీ చేయనున్నది. జీపీవో పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.