హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించినట్టు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధర పడిపోవడం, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ‘నమస్తే తెలంగాణ’ ‘ప్రభుత్వం చెప్పదు.. మార్క్‌ఫెడ్ కొనదు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది.
దీంతో కదిలిన ప్రభుత్వం మక్కల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. గురువారం తుమ్మల మాట్లాడుతూ మక్కలను క్వింటాల్‌కు ధర రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. రాష్ట్రం లో 6,24,544 ఎకరాల్లో మక్క సాగయిందని, 11.56 లక్షల టన్నుల పం ట ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ సీజన్లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాల్సి ఉం టుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.