హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): గ్రామ పరిపాలనా అధికారుల ఉద్యోగోన్నతులపై ప్రభుత్వం నిర్ణయం వెలువరించిం ది. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలను గ్రామ పరిపాలనా అధికారులుగా నియమించిన ప్రభుత్వం వారి ఉద్యోగోన్నతులకు వీలుగా సవరణలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వారి ఉద్యోగోన్నతులకు 60:40 నిష్పత్తిని అమలు చేస్తూ బుధవారం జీవో జారీచేసింది.
తాజా జీవోలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, గ్రామపాలనా అధికారుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన మినీస్టీరియల్ సర్వీస్ రూల్స్ 1998కి సవరణలు చేసింది. తద్వారా సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, గ్రామ పరిపాలనా అధికారుల మధ్య 60:40 నిష్పత్తిని ఖరారు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న ఉద్యోగోన్నతులలో 60శాతం కోటాను రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు, మిగిలిన 40శాతం కోటాను గ్రామ పాలనా అధికారులకు కేటాయించనున్నారు.