హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో ‘బకెట్’ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవలే బకెట్ సిస్టంను రద్దుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించగా, ఈ ప్రతిపాదనలను సర్కారు తిరస్కరించింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ‘దోస్త్’నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, ఆరు వర్సిటీల వీసీలు హాజరయ్యారు.
బకెట్ సిస్టం అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో చర్చ జరిగింది. అకాడమిక్ మధ్యలో నిర్ణయాలు తీసుకుంటే గందరగోళానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరించినట్టు తెలిసింది. లోపాలుంటే సమీక్షించి సరిదిద్దాలి లేదా ఓ కమిటీ వేసి అభిప్రాయాలు తీసుకోవాలే తప్ప ఇలా ఏకపక్షంగా రద్దు నిర్ణయం ప్రకటిస్తే ఎలా..? అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విద్యాసంవత్సరంలో బకెట్ విధానాన్ని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణను అమలుచేయాలని, కొన్ని సబ్జెక్టుల పేర్లు మార్చాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.