హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపోయింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) 2026 డైరీ, క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి కానుకగా డీఏ ఫైల్‌పై సంతకం చేసి వచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కో టి రూపాయల సమగ్ర బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్లను త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని ప్రకటించారు.
3.64 శాతం పెరిగిన డీఏ
రాష్ట్రంలోని ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) 3.64 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా రెండు జీవోలను విడుదల చేశారు. తాజా పెంపుదలతో 30.03 శాతంగా ఉన్న డీఏ 33.67 శాతానికి చేరనుంది. పెరిగిన డీఏ జూలై ఒకటి, 2024 నుంచి వర్తించనున్నది. పెరిగిన డీఏను జనవరి నెల వేతనంతో ఫిబ్రవరి ఒకటిన చెల్లించనున్నారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమచేయనున్నారు. పెన్షనర్లకు బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం ఏరియర్స్‌ను 30 విడుతల్లో చెల్లించి, 10 శాతం ఎరియర్స్‌ను ప్రాన్ ఖాతాలో జమచేయనున్నారు.
మళ్లీ ఐదు డీఏలు బాకీ
రాష్ట్రంలో 3.6లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2.9 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ)ను సర్కార్ విడుదల చేయాలి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తున్నది. రెండేండ్ల కాలంలో రెండు డీఏలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మూడో డీఏను ప్రకటించింది. 2023 జూలై ఒకటి నుంచి ఈ జనవరి ఒకటి నాటికి సర్కార్ మొత్తం ఆరు డీఏలు బాకీపడింది. ఇప్పుడొక డీఏ ప్రకటనతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరింది. వాస్తవానికి 2023 జనవరి 1న చెల్లించాల్సిన డీఏను, జూన్ 13న విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 2023న మరో డీఏను ఇవ్వాల్సి ఉండగా, ఈ డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని ఆయా జీవోలో స్పష్టంచేసింది. ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత ఇస్తామన్న ఒక డీఏను ప్రకటించింది.
పెండింగ్ డీఏల్లో నంబర్ వన్..
డీఏల పెండింగ్‌లో తెలంగాణ నంబర్-1 స్థానంలో ఉన్నది. దేశంలో మరే రాష్ట్రంలోను ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు. ఏపీలో 2, బీహార్ 2, ఛత్తీస్‌గఢ్ 1, రాజస్థాన్, కేరళ, గుజరాత్ ఒకటి చొప్పున డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ఐదు పెండింగ్ డీఏల ఆనవాయితీని కొనసాగిస్తున్నది. పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరే సమయంలో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకొంటున్నది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నైరాశ్యం నెలకొంది. మిగిలిన డీఏలపై స్పష్టత నివ్వడంలేదు. మిగతా ఐదు డీఏలను సైతం విడుదల చేయాలని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, నన్ను కోసుకుతిన్నా రూపాయి లేదన్నారు.. అప్పులు పుడుతలేవన్నారు. బ్యాంకర్లు తనను దొంగలెక్క చూస్తున్నారన్నారు. మీరేమో 40వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఈ 40వేల కోట్లు ఏం చేశారు. దీంట్లో ఉద్యోగులకు ఇచ్చింది ఎంత..? అని సోషల్‌మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి కోసం సైన్యంలా పనిచేస్తాం: ఏలూరి శ్రీనివాసరావు
సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగా, ప్రభుత్వంగా తాము ఆరాధిస్తున్నామని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యమకారులు, 87 వేల మంది గెజిటెడ్ అధికారులు, 15 లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నామని చెప్పారు. గెజిటెడ్ అధికారులం సీఎం రేవంత్‌రెడ్డి కోసం సైన్యంలాగా పనిచేస్తామని, ఈ ఐదు సంవత్సరాలే కాకుండా.. వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తామని ఉద్ఘాటించారు. అవసరమైతే సెలవుల్లో, మరో గంట అదనంగా పాటుపడతామని వాగ్దానం చేశారు. గెజిటెడ్ అధికారులుగానే కాకుండా ఉద్యోగుల జేఏసీగాను ఈ హామీనిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యోగులు డీఏ, పీఆర్సీ, సీపీఎస్, హెల్త్‌కార్డుల కోసం వాట్సాప్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం అన్నింటికి అతీతశక్తి కావడంతో తట్టుకుంటున్నారని, కానీ తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. టీజీవో సంఘం, సీఎం కుమ్మక్కయ్యారని ప్రాథమిక సభ్యులు గగ్గోలు పెడుతున్నారని, వాట్సాప్‌లలో చూడటానికి వీల్లేని సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు.
ఒక్క డీఏతోనే చేతులు దులుపుకొంటారా?
ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్ ఉన్న ఐదు డీఏల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే ఒక్క డీఏతోనే చేతులు దులుపుకొంటారా? అని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మండిపడ్డారు. ఒకే ఒక్క డీఏ విడుదలతో అంతా నైరాశ్యంలో మునిగారని తెలిపారు. మిగిలిన డీఏల ఊసెత్తకపోవడం, పీఆర్సీపై స్పష్టతనివ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు.
పెండింగ్ డీఏలివే..