Fee Reimbursement | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
ఇంతకాలం ఎంతో కష్టపడి డిగ్రీ, పీజీ, బీఈ తదితర కోర్సులు పూర్తిచేసిన పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నతాధికారులు, కాలేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూలో బీఈ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రభు త్వం నుంచి రాలేదని, హాస్టల్, ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని తేల్చిచెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ పూర్తిచేసిన ఓ విద్యార్థి సర్టిఫికెట్ల కోసం వైస్ చాన్స్‌లర్‌కు మెయిల్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు సుమారు రూ.10వేల కోట్ల వరకు పేరుకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కార్‌లో మాత్రం ఎలాంటి చలనం రాలేదు. ఈ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అష్టకష్టాలు పడి ఉన్నత విద్యను అభ్యసిస్తే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు వేలకువేలు చెల్లించాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల్లోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లతో నడిచే యూనివర్సిటీల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్ సాకుతో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
ఈ పరిస్థితి ఒక్క పెద్దపల్లి జిల్లా పరిధిలోనే కాదని, అన్ని యూనివర్సిటీలోనూ మార్కుల మెమోలు, ట్రాన్స్ఫర్, స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ భరోసాతోనే లక్షలాది మంది బీటెక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో చేరారు. కాంగ్రెస్ సర్కార్ ఫీజు చెల్లించడంలేదనే కారణంతో పలు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలు సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు. దీంతో తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థాయిలో స్థిరపడుతారని ఆశిస్తే.. రేవంత్ సర్కార్ తీరుతో చదువుకు దూరంకావాల్సి పరిస్థితులు దాపురించాయని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
మంథని జేఎన్టీయూ కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దారుణమని మైనారిటీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్‌పాషా మండిపడ్డారు. ప్రైవేట్ కాలేజీల మాదిరిగా ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా వ్యవహరించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ విద్యార్థులు బలికావాల్సిరావడం బాధాకరమని వాపోయారు. వెంటనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.