కరీంనగర్ : విద్య, వైద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం తీగలగుట్టపల్లిలో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించాలనే సంకల్పంతో మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9,123 పాఠశాలలను ప్రభుత్వం ఆధునీకరిస్తుందని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు సంవత్సరాలలో 281 గురుకులాలు స్థాపించి లక్షా 35 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉన్నత వర్గాలకు దీటుగా నిరుపేద విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని వెల్లడించారు.
మన ఊరు, మన బడి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని, రాజకీయాలకతీతంగా విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరిలో దేవాలయం, విద్యాలయం ఉంటాయని ..స్కూళ్లు కూడా దేవాలయాల్లంటివే అన్నారు.
కరీంనగర్ జిల్లాలోని ఏదైనా స్కూలుకు వాడుకునే విధంగా తన సోదరుని పేరిట రూ.20 లక్షల రూపాయలు మా కుటుంబం తరఫున ఇస్తామని ప్రకటించారు. పేద పిల్లలు చదువుకునే సర్కారు స్కూలును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కార్పొరేటర్లు కొలగని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య తదితరులు పాల్గొన్నారు.