హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక సహకార సంఘాలకు(పీఏసీఎస్)ఎన్నికలు జరుపకుండా, రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) అధ్యక్షుడు బీ హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర రైతు సంఘం కార్యాలయంలో వారు మాట్ల్లాడారు. 908 సహకార సంఘాలకు ఎన్నికలు జరుపకుండా నామినేటెడ్ పాలకమండళ్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
ప్రతి సంఘంలో 13మంది సభ్యుల పేర్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను.. అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి పేర్లను సేకరించిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత లేదని వారు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 హెచ్ ప్రకారం ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించి, రైతు సంఘం ఆధ్వర్యంలో గురు,శుక్ర వారాల్లో నిర్వహించే నిరసనలను విజయవంతం చేయాలని రైతులకు హేమంతరావు, పద్మ పిలుపునిచ్చారు.