హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)లలో పాలన అదుపు తప్పుతున్నది. పన్నుల ద్వారా వసూలవుతున్న సొమ్మును జవాబుదారీతనం లేకుండా స్థానిక అధికారులు ఇష్టారాజ్యాంగా దుర్వినియోగం చేస్తున్నట్టు తరచూ ఆరోపణలొస్తున్నాయి. తాజాగా చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. అక్కడి అధికారులు చేపట్టిన నీటి సంపు నిర్మాణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సంపు నిర్మాణానికి రూ. 14 లక్షలకు టెండరు ఖరారు కాగా, పనులు చేపట్టాక వ్యయాన్ని రూ. 75లక్షలకు పెంచడమే వివాదానికి ప్రధాన కారణం.
వ్యయం పెంపును ఐలా మేనేజింగ్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పనుల్లో అవకతవకలు జరిగినట్టు టీజీఐఐసీకి పలువురు ఫిర్యాదు చేశారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని పరిశ్రమల అవసరాల కోసం 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి సంపు నిర్మాణానికి గత నెలలో టెండర్లు ఖరారు చేశారు. రూ. 24 లక్షల అంచనాతో టెండర్లు పిలవగా, అతి తక్కువగా రూ. 14 లక్షలు కోట్ చేసిన ఏజెన్సీకి పనులు అప్పగించారు. అయితే పనులు ప్రారంభమైన కొన్ని రోజులకే అంచనా వ్యయాన్ని రూ. 75 లక్షలకు పెంచారు. ఈ మేరకు టీజీఐఐసీ ఎండీ నుంచి స్థానిక ఐలా కమిషనర్ అనుమతి పొందారు.
ఇటీవల నిర్వహించిన ఐలా నిర్వహణ కమిటీ సమావేశంలో అంచనా వ్యయం పెంపు ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, కమిటీ తిరస్కరించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టెండరు ధరకు నాలుగైదు శాతం వరకు వ్యయం పెంచుకోవచ్చు. కానీ, ఏకంగా ఐదారు రెట్ల వ్యయాన్ని పెంచడం ఏమిటని కమిషనర్‌ను నిలదీశారు. కాంట్రాక్టరు, కమిషనర్ కుమ్మక్కై ఐలా నిధులను దండుకునేందుకు సంపు నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమతి కోసం టీజీఐఐసీ యాజమాన్యాన్ని కూడా వారు తప్పుదోవ పట్టించారని విమర్శిస్తున్నారు. టెండర్లలో కోట్ చేసిన రూ. 14 లక్షలకే పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు. దీనిపై కమిషనర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలతోపాటు స్థానిక పరిశ్రమల నిర్వాహకులు టీజీఐఐసీ ఎండీకి ఫిర్యాదుచేశారు. ఐలా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకోవాలని, విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.