Raja Singh | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నది. పదవి కోసం పోటీపడి భంగపడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వెయ్యనివ్వలేదని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వస్తే.. తన మద్దతుదారులను కొందరు బెదిరించారని, జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారనర్నారు. పార్టీలో ఉంటారా? సస్పెండ్ చేయాలా? అని హెచ్చరించారని తెలిపారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదన్నారు.
నా నామినేషన్ పత్రంపై సంతకం చేసేందుకు పది మంది సిద్ధంగా ఉన్నారని.. కానీ, మద్దతుదారులను నామినేషన్‌పత్రంపై సంతకాలు చేయనివ్వలేదని విమర్శించారు. నా విషయంలో లక్షలాది మంది కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. రామచందర్‌రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. 2014 నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారని, పార్టీ సింబల్‌పై తాను ఎమ్మెల్యేగా గెలిచానని.. రాజీనామా లేఖను సైతం కిషన్‌రెడ్డికి అందించానన్నారు. స్పీకర్‌కు రాజీనామా లేఖను కిషన్‌రెడ్డే పంపించాలన్నారు. పార్టీ కోసం తాను సర్వం ధారపోశానని.. ఉగ్రవాదులకు టార్గెట్‌గా ఉన్నానన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్యనించిన రాజాసింగ్.. ఆ పార్టీకి రాజీనామా చేసిన హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.