హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలను విద్యారంగంలో జోడించేందుకు ‘రిలయన్స్ జియో’ రాష్ట్రంలో సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక ఏఐ సాధనాలను సంస్థ తరగతి గదికి చేరువ చేస్తున్నది. బోధనాభ్యసన పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు గూగుల్ జెమిని ప్రోను ప్రవేశపెట్టింది. గూగుల్ జెమిని ప్రో అనేది పూర్తిగా అప్లికేషన్ ఏఐ (ఆచరణాత్మక ఏఐ). ఈ ఏఐ వినియోగంలో టీచర్లు, విద్యార్థులకు సంస్థ శిక్షణనిస్తున్నది. అయితే, గూగుల్ జెమిని ప్రో అప్లికేషన్ ఏఐ వినియోగం రాష్ట్రంలో విజయవంతమైనట్టు జియోవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 700 పైచిలుకు పాఠశాలల్లో ఈ ఏఐని వినియోగిస్తున్నట్టు స్పష్టంచేశాయి. 7వేలకు పైగా టీచర్లు, విద్యార్థులకు వర్క్‌షాప్‌లు నిర్వహించినట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.
వివిధ అంశాలపై శిక్షణ
పాఠ్యాంశాల నోట్స్ తయారుచేయడం, అసైన్మెంట్లు రాయడం, సంక్షిప్త కోడింగ్ ప్రాజెక్ట్‌లను గూగుల్ జెమిని ప్రో అప్లికేషన్ ఏఐ ద్వారా ఎలా తయారుచేయవచ్చు అనే అంశాలపై శిక్షణ ఉంటుంది. ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం ఏఐని ఎలా వినియోగించాలనే అంశాలపైనా శిక్షణ లభిస్తుంది. వీటితోపాటు ఉచిత ఏఐ ప్లాన్‌ను సైతం జియో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అన్లిమిటెడ్ 5జీ సబ్‌స్ర్కైబర్లకు 35,100 విలువైన గూగుల్ జెమినిప్రో ప్లాన్‌ను 18 నెలలపాటు ఉచితంగా అందిస్తున్నది. వినియోగదారులు ‘మై జియో’ యాప్ ద్వారా ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది జెమిని 3 ప్రో మాడల్పాటు హై ఎండ్ క్రియేటివ్ టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంది. దీంట్లో నానో బనానా ప్రో, వీయో 3.1 వంటివి ఉన్నాయి. అకడమిక్ రిసెర్చ్ కోసం నోట్‌బుక్ ఎల్ఎం డేటా కోసం 2టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఇదే ప్లాన్‌లో పొందవచ్చు.
యువత కోసం ‘ఏఐ క్లాస్రూమ్’
యువత కోసం సంస్థ ప్రత్యేకంగా ‘జియో ఏఐ క్లాస్రూమ్’ అనే మరో ప్రోగ్రామ్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఇది నాలుగు వారాల వ్యవధి గల ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్. విద్యార్థులు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లపై అప్లికేషన్ ఏఐని వినియోగించేలా ఈ కోర్సును రూపొందించారు.