హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయాల్లో పోగొట్టుకుంటున్న విలువైన వస్తువులను బాధితులకు అప్పగిస్తూ.. ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 25న సూర్యాపేట-హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికురాలు రూ.6 లక్షల విలువైన వస్తువులున్న బ్యాగును మర్చిపోగా, కండక్టర్ అంజయ్య, డ్రైవర్ పాషా గుర్తించారు. అధికారుల సమక్షంలో బాధితులకు అందజేశారు. 15న ఆర్టీసీ బస్సు ఎయిర్‌పోర్టు నుంచి లింగంపల్లికి వస్తుండగా, ఓ ప్రయాణికురాలు రూ.8లక్షలు విలువైన వస్తువులున్న బ్యాగును మర్చిపోయారు. డ్రైవర్ ముబీన్ గుర్తించి, అధికారుల సమక్షంలో ఆమెకు అప్పగించారు. ఈనెల 25న ఎయిర్‌పోర్టు బస్సులో శిల్పారామం వద్ద ఓ ప్రయాణికుడు రూ.5లక్షలు విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను మర్చిపోగా, డ్రైవర్ రమేశ్ గుర్తించి, అధికారుల సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు. వీరందరినీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు.