కాసిపేట, జూన్ 22 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎస్జీటీలు తమ ఉపాధ్యాయ సంఘాల పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సమావేశమైన వారు.. పదోన్నతుల్లో జరుగుతున్న తీవ్ర అన్యాయానికి, వివిధ సంఘాలు ఎస్జీటీలను ద్వితీయశ్రేణి ఉపాధ్యాయులుగా భావిస్తూ, వారు చూపుతున్న వివక్షను ఖండిస్తూ వివిధ సంఘాల్లో ఉన్న పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ప్రతి అంశంలో తీవ్రంగా వివక్షకు, అణచివేతకు గురవుతున్నందున పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్, టీపీయూఎస్, టీయూటీఎఫ్, డీటీఎఫ్, టీజీయూఎస్ తదితర సంఘాలకు రాజీనామా చేసి ఎస్జీటీల న్యాయమైన హకుల కోసం సమష్టిగా కృషి చేస్తామని ఎస్జీటీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఎస్ఏ తెలుగు, హిందీ, పీడీ పదోన్నతుల్లో కామన్ సీనియారిటీని పాటించాలని, 10 వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేసి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎఫ్ఎల్ఎన్ రద్దు చేయాలని, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, పీఆర్సీలో ఎస్‌ఏలకు ఎస్జీటీల మధ్య భారీ వ్యత్యాసాన్ని తగ్గించాలని, జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన ఎస్జీటీలకు న్యాయం చేయాలని, 12 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన ఎస్జీటీలకు ఎస్ఏ హోదా కల్పించాలని, కోరారు. 24 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఎస్జీటీలకు జీహెచ్ఎం హోదా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీటీ జేఏసీ నాయకులు వేల్పుల కిరణ్‌కుమార్, జంగపల్లి సురేశ్, శారద, రాధిక, అర్పిత, ప్రకాశ్, సతీశ్, రాజయ్య, సుచరిత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.