ఆర్కేపురం, సెప్టెంబర్ 3: పద్మశాలీల ఐక్యతతోనే సత్ఫలితాలు అందుతాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. రాజకీయ రంగంతో పాటు వ్యాపార రంగంలో పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో దాదాపు 17 లక్షల మంది పద్మశాలీలు ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో పద్మశాలి రాజకీయ శంఖారావం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ.. టెక్స్టైల్ రంగాన్ని కేంద్రం విస్మరించినా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో చేనేత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రాజకీయ, సామాజిక సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమాల్లో పద్మశాలీల పాత్ర కీలకమని తెలిపారు. మొట్టమొదటి చట్టసభల్లో ముగ్గురు పద్మశాలీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ క్రియాశీలకంగా పోరాడారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతన్నలకు సెప్టెంబర్ నుంచి రూ.3 వేలు ఇస్తున్నారని వివరించారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ సరూర్‌నగర్ అంటేనే సిరిపురం యాదయ్య గుర్తుకొస్తారని తెలిపారు. పద్మశాలీల రాజకీయ చైతన్యంతోనే అన్ని పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తాయని వెల్లడించారు. పద్మశాలీల బతుకులు బాగుపడాలంటే రాజ్యాధికారం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
చట్టసభల్లో ప్రాతినిథ్యం ఉంటేనే ఆత్మగౌరవం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, పవర్‌లూం అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, బొల్ల శివశంకర్, కటకం నర్సింగ్‌రావు, గుజ్జ సత్యం, అవ్వారి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి రావిరాల సంధ్యారాణి, వనం దుష్యంతుల, పున్న గణేశ్, తలాటి రమేశ్, ఆరుట్ల సురేశ్, కౌకుంట్ల రవితేజ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి రాజకీయ శంఖారావం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాలు
1. 8 శాతం జనాభా కలిగిన పద్మశాలీలకు 6 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు, రాజకీయ పదవుల్లో వాటా, పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు సముచిత స్థానం కల్పించాలి.
2. పద్మశాలి సమాజాన్ని గుర్తించే రాజకీయ పార్టీలను మాత్రమే పద్మశాలి సమాజం గౌరవిస్తుంది, ఆదరిస్తుంది.
3. మనకు అండగా ఉండని పార్టీలకు పద్మశాలీలంతా నోటా ఓటు వేయాలి.
4. చేనేత జౌళిశాఖను పునరుద్ధరించాలి.
5. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, టీఎస్సీవోను బలోపేతం చేసి చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ సౌకర్యాలు మొరుగుపరచాలి.
6. పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ వృత్తుల్లో కొనసాగుతున్న 90 శాతం పద్మశాలీలకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.