హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధిష్ఠానంపై గొల్లకురుమ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో తమ వర్గానికి చోటు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు మొత్తం 96 మందితో ఏర్పాటుచేసిన జంబో కార్యవర్గంలో ఒకే ఒక్క యాదవ నేతకు చోటు కల్పించారు. కాంగ్రెస్ అధిష్ఠానం రాయగిరి కల్పనాయాదవ్ను పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించింది. అదే సమయంలో బీసీల్లోనే ఒక వర్గానికి ఏకంగా 14 పోస్టులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం? రాష్ట్ర జనాభాలో 18.5% ఉన్న గొల్ల కురుమలకు పదవుల్లో కనీసం 1% కూడా ఇవ్వరా? అని ప్రశ్నిస్తున్నారు. గత కార్యవర్గంలో ఎనిమిది మంది గొల్ల కురుమ నేతలకు స్థానం ఉండేది. జనరల్ సెక్రటరీలు నలుగురు ఉం డగా, వైస్ ప్రెసెడింట్ పదవి ఒకటి ఉండేది. కానీ తాజా కమిటీలో ఒకే ఒక్కరికి అవకాశం కల్పించారు.
కాంగ్రెస్ పాలనలో గొల్ల కురుమ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ప్రభుత్వ పదవుల్లో, ఇటు పార్టీ పదవుల్లోనూ చోటు దక్కడంలేదు. మంత్రివర్గంలో ఒక్కరు కూడా ఈ వర్గానికి చెందిన వారు లేరు. యాదవ నేత లేకుండా మంత్రివర్గం ఉండటం ఇదే తొలిసారని చెప్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ గొల్ల కురుమలకు ఒక్క పదవి కూడా దక్కలేదు. కనీసం పార్టీ పదవుల్లో అయినా చోటు దక్కుతుందని భావించిన ఆ వర్గం నేతలకు నిరాశే మిగిలింది. 96 మందిలో ఒకేఒక్క యాదవ నేతకు చోటు దక్కింది. అడ్వైజరీ కమిటీలో అంజన్‌కుమార్‌యాదవ్‌కు మాత్రమే చోటు కల్పించిన అధిష్ఠానం మరే కమిటీలోనూ గొల్ల కురుమలకు స్థానం ఇవ్వలేదు.
కార్యవర్గంలో ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి స్థానం కల్పించడంపై గొల్ల కురుమ నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నవారిని కాదని, నిన్నమొన్న వారి స్వార్థం కోసం పార్టీలోకి వచ్చిన వారికి, పైరవీలు చేసేటోళ్లకే పదవులిస్తరా? అని ప్రశ్నిస్తున్నారు. 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులంటూ సన్నాయి నొక్కులు నొక్కి ఇప్పుడు అడ్డదిడ్డంగా పదవులు ఇచ్చారంటూ రగిలిపోతున్నారు. ఈ మధ్యకాలంలోనే పార్టీలోకి వచ్చిన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, బొంతు రామ్మోహన్, జగదీశ్‌గౌడ్, రామారావుగౌడ్, జగదీశ్వర్‌రావు, భూషణం, గోవిందరావు వంటి నేతలకు కార్యవర్గంలో చోటు కల్పించడంపై ఆభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందన్న అభిప్రాయాన్ని గొల్ల కురుమ నేతలు వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, పార్టీలో రెండింటిలోనూ గొల్ల కురుమలకు తగిన ప్రాధాన్యం లభించిందని గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి, బడుగుల లింగయ్యయాదవ్‌కు రాజ్యసభ, ఎగ్గె మల్లేశంకు ఎమ్మెల్సీ పదవితోపాటు నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చిందని గుర్తుచేసుకుంటున్నారు. సర్కారు గొల్ల కురుమలను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడుతున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ-కురుమలకు స్థానం కల్పించాలని తెలంగాణ గొర్రెల, మేకల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో చీల్చిచెండాడుతామని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చీమునెత్తురూ ఉంటే కాంగ్రెస్‌లోని యాదవ నాయకులైన అంజన్‌కుమార్, అనిల్, బీర్ల ఐలయ్య, చరణ్ తదితరులు మాల, మాదిగ నాయకులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. లేదంటే ముక్కునేలకు రాసి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.