యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు సంకల్పం నెరవేరింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం ఆవిష్కృతమైంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురాన్ని బంగారంతో తాపడం చేయాలని కేసీఆర్ భావించారు. 2022 సె ప్టెంబర్ 20న స్వయంగా కుటుంబ సమేతం గా దర్శించుకొని, కిలో 16 తులాల బంగారా న్ని స్వామివారికి విరాళంగా అందించారు. బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ప్రముఖులు, భక్తులు స్వామివారికి పసిడిని సమర్పించారు.
నవంబర్ 15న గోపురానికి స్వర్ణ తాపడం రేకులు అమర్చే ప నులు ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యా యి. విరాళాలతోపాటు ఆలయ వనరులతో కలిపి 68 కిలోల బంగారంతో 50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యంతో బంగారు రేకులను అమర్చారు. స్వర్ణ గోపురానికి ఆరడుగుల ఎత్తుతో సుదర్శన చక్రాన్ని రూపొందించారు. 16 కర్ణ కూటము లు, 16 ముఖ శాలలు, 4 మహా నాసికాలు, 24 కేశమూర్తి, 4 తార్క్ష్య, పక్ష్య, గరుడ, సు పర్ణ మూర్తులు, 4 వాసుదేవ సంకర్షణ ప్రద్యు మ్న అనిరుద్ద మూర్తులు, 5 నరసింహ మూ ర్తులు, 8 సింగం మూర్తుల రూపాలు రూపొందించారు. విమానంపై ఉన్న నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి, గరుడ మూర్తి ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి. ఈ గోపురం దేశంలోనే ఎత్తయినదిగా రికార్డు సృష్టించింది.
ఆలయంలో దివ్య స్వర్ణ విమాన గోపురం మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11.54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి దివ్య మంగళ శాసనాలతో ఆగమశాస్త్రం ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహస్వామివారికి గోపురాన్ని అంకితం చేశారు. సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా సం ప్రోక్షణ అనంతరం త్రితల రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి చేరుకున్నారు.
స్వయంభూ పంచ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ముఖ మండపంలో చతుర్వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో భాస్కర్‌రావు స్వామివారి ప్రసాదంతోపాటు చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామెల్, వేముల వీరేశం, బాలునాయక్, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.