హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులను కోరారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలని సూచించారు. గోద్రేజ్ కంపెనీ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా తదితర రంగాల్లో వ్యాపారం చేస్తున్నది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాంసింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోకాకోలా మొబైల్ టాయిలెట్స్
ప్రముఖ శీతల పానియాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బెవెరేజెస్ (హెచ్‌సీసీబీ) తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకొచ్చింది. మంగళవారం కంపెనీకి చెందిన ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో భేటీ అయింది. ఈ సందర్భంగా నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, వ్యర్థ జలాల పునర్వినియోగం, యు వతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, ఉద్యోగ అవకాశా ల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని కం పెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామా ల్లో తాగునీటి ట్యాంకులు, పాఠశాలల్లో మొబైల్ టాయిలెట్లు, అంగన్వాడీ భవనాలు నిర్మింస్తామని చెప్పారు. వ్యర్థాల నిర్వహణపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమా రు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో గ్రీన్‌ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉన్నదని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులతోపాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీసీబీ పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు, క్లస్టర్ హెడ్ ముకుంద్ త్రివేదీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌తో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మర్యాద పూర్వకంగా కలిసింది. మంగళవారం సీఎం నివాసంలో వివేక్ కే టంకా నేతృత్వంలోని కమిటీ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శనసింగ్, విల్సన్, వీణాదేవి, జస్బీర్సింగ్ గిల్, రఘురామ కృష్ణరాజు సహా ఇతర కమిటీ సభ్యులు కలిశారు.