కాసిపేట, సెప్టెంబర్ 15 : మెడిసిన్ సీట్లో నాన్ లోకల్ సమస్యలతో నష్టం జరుగుతున్నదని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన గొడిశెల లాస్య, ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. లాస్య కుటుంబం తాతల కాలం నుంచి మంచిర్యాల జిల్లాలోనే నివసిస్తున్నది. ఇక్కడే 10వ తరగతి వరకు చదివి, ఇంటర్ రెండేండ్లు ఏపీలోని విజయవాడలో చదివింది. నీట్లో 408 సాధించింది.
ఎస్సీ విభాగంలో మెడిసిన్‌లో సీటు వచ్చే అవకాశం ఉండగా, ఇంటర్ ఏపీలో చదవడంతో నీట్ రాష్ట్ర కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాన్ లోకల్‌గా చూపిస్తున్నదన్నారు. తెలంగాణాలో జీవిస్తూ 10వ తరగతి వరకు ఇక్కడే చదవి కేవలం ఇంటర్ రెండేళ్లు బయటకు వెళ్లి వస్తే నాన్ లోకల్‌గా పరిగణిస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.