హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాలకుల బేషజాలు, ముందుచూపు లేని నిర్ణయాలతో గోదావరి జలాలు వృథా అవుతున్నాయని ‘తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం’ (టాస్క్) ఆందోళన వ్యక్తంచేసింది. టాస్క్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా టాస్క్ అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహం 15వేల క్యూసెకులుగా నమోదవుతుందని తెలిపారు. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో ఆ నీటిని వాడుకునే అవకాశాన్ని వదులుకోవడం రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. బరాజ్ 85 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచడంతో వచ్చిన నీరు వచ్చినట్టుగా వృథాగా దిగువకు వెళ్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు మేడిగడ్డ వద్ద 10 నుంచి 12 టీఎంసీల నీరు సముద్రం పాలవడం బాధాకరమని పేర్కొన్నారు.
బరాజ్ పంప్‌హౌస్ ఇన్టెక్కు దిగువన ఒక రబ్బర్ డ్యాం లేదా మట్టికట్ట వేసి నీటిమట్టాన్ని 95 మీటర్లకు పెంచి ఆ నీటిని మళ్లించవచ్చని రెండేండ్ల క్రితమే అప్పటి ఈఎన్సీ ప్రభుత్వానికి నివేదించినా, పాలకులు ఆ సూచనలను చెత్తబుట్టలో వేసి నిర్లక్ష్యం చేశారని టాస్క్ అధ్యయన వేదిక పేర్కొన్నది.
ఇప్పటికే జలాశయాల్లోని నీటిని పొదుపుగా వాడుకోవాలని కేంద్ర జలసంఘం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. సమావేశంలో ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్, వేణుగోపాలస్వామి, జీ వెంకటేశ్వర్లు, రవీందర్, సురేశ్, ఎస్వీసీ ప్రకాశ్, రూబీ స్టీఫెన్సన్, రాజు, ఫరీద్, లక్ష్మణ్, వెంకన్న పాల్గొన్నారు