భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో గోదావరిలో క్రమంగా వరద అధికమవుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదవారి నీటిమట్టం 45.90 అడుగులకు చేరింది. నదిలో 10,48,826 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఉదయం 8 గంటల సమయంలో గోదవారి నీటిమట్టం 45.60 అడుగుల వద్ద ఉండగా, 10,36,818 క్యూసెక్కుల నీరు ప్రవహించింది.
గతవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో నది ఉధృతంగా ప్రవహించిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డుస్థాయికి చేరింది. నదిలో వరద ఇంకా తగ్గకపోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తి 1.99 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇల్లందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెంలో 5.6 సెంటీమీట్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఉపరితల గనిలో రాత్రి నుంచి బొగ్గు ఉత్పతి ఆగిపోయింది.