భద్రాచలం: వరద గోదావరి (Godavari River) శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ నెమ్మదించింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 40.6 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 39.5 అడుగులకు తగ్గింది. గురువారం మధ్యాహ్నం ప్రవాహం 43 అడుగులకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 41.10 అడుగులకు ప్రవాహం చేరుకున్నది. అప్రమత్తమైన అధికారులు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా 110 ముంపు గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల ప్రజలను 70 పునరాస కేంద్రాలకు తరలించారు.
భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో నిలిచిన వరద నీటిని సీతారామ ప్రాజెక్టు పనులకు వినియోగించిన బాహుబలి విద్యుత్ మోటార్ల ద్వారా మళ్లించారు. మంత్రి అజయ్‌కుమార్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ప్రత్యేకాధికారులు అనుదీప్, గౌతమ్ పోట్రు, కృష్ణ ఆదిత్య పట్టణంలో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. కేంద్రాల్లో అన్ని వసతులు ఉంటాయని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.