పెద్దపల్లి, మార్చి 17 (నమస్తే తెలంగాణ): వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీల్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కడుపు మంటతో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీటి గోసకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టేందుకోసం చేపట్టిన ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్ర (Maha Padayatra) పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని గోదావరి తీరం నుంచి ప్రారంభం అయింది. గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 22వరకు ఉద్యమాల పురిటి గడ్డ నుంచి గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180కిలో మీటర్ల మహా పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కో-ఆర్డినేటర్ బొడ్డు రవీందర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే చేయగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపల్లి దివాకర్ రావులు ప్రసంగించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రామగుండంలోఅగ్గి అంటుకున్నదని ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందన్నారు.
ఈ మహా పాదయాత్ర అన్నధాతల కష్టాలను, కన్నీళ్లను ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిపోయిన కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నీళ్లను తుడిస్తే.. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం కూలిందని నెపం మోపి నీటిని దిగువకు వదిలి తెలంగాణను ఎండబెట్టిందని విమర్శించారు. కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజ్‌లు, 15రిజర్వాయర్లు, 19సబ్ స్టేషన్లు, 21పంపు హౌస్‌లు, 200 కిలో మీటర్ల సొరంగాలు, 1530కిలో మీటర్ల గ్రావిటీ కెనాళ్లు, 98కిలో మీటర్ల ప్రెజర్ మెంట్స్, 141టీఎంసీల కెపాసిటీ ఉన్న 530మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240టీఎంసీల ఉపయోగంతో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించారని అన్నారు. కాళేశ్వరం ఎండబెట్టడం వల్లే తెలంగాణలో రైతన్నల పంట పొలాలు ఎండుతున్నాయని ప్రజలకు వివరించే విధంగా ఈ 180కిలో మీటర్ల యాత్ర సాగుతుందన్నారు. పాదయాత్ర కు రూపకల్పన చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయ రెడ్డి, కౌశిక్ హరి, రఘువీర్ సింగ్, ఉప్పు రాజ్ కుమార్ లతోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
యాత్ర సాగేదిలా..
సోమవారం ఉదయం గోదావరిఖనిలో ప్రారంభమైన పాదయాత్ర.. మధ్యాహ్నానికి పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌కు చేరుకుంటుంది. భోజనం పూర్తి చేసుకొని పెద్దపల్లి శివారులోని బంధంపల్లి స్వరూప గార్డెన్‌కు నాయకులు చేరుకుంటారు. రాత్రి అక్కడ బస చేసి, రెండో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమై, పెద్దపల్లి మీదుగా సుల్తానాబాద్‌కు బయలు దేరుతారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుంటారు. మూడో రోజు బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరి అల్గునూర్ మీదుగా బెజ్జంకి ఎక్స్‌రోడ్‌కు చేరుకుంటారు. నాలుగో రోజు గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఇబ్రహీంనగర్‌కు చేరుకుంటారు. సిద్దిపేట రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో రాత్రి బస చేస్తారు. ఐదో రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం కొమురవెల్లి-1 హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి వరకు ప్రజ్ఞాపూర్‌కు చేరుకుంటారు. ఆరో రోజు శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమై మధ్యలో భోజనం చేసి ఎర్రవెల్లి వరకు వెళ్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కన్నీటి బాధలు, రైతన్నల కన్నీటి గాధలను వివరించనున్నారు.