బాసర/భద్రాచలం/మహదేవపూర్/వాజేడు, ఆగస్టు 30 : నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకుతోడు మహారాష్ట్రలో పడిన వానలకు రాష్ట్రంలోని పలుచోట్ల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. బాసరతోపాటు భద్రాచలం, కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం పెరిగింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 1984 తర్వాత అంటే దాదాపు 40 ఏండ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని బాసర గ్రామస్థులు పేర్కొంటున్నారు. పుష్కరఘాట్లు నీట మునగగా.. సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారులు జలమయమయ్యాయి. దుకాణ సముదాయాలు, పలు కాలనీల్లోకి వరద చేరింది. అమ్మవారి ఆలయ ప్రవేశమెట్ల వద్ద ఉన్న వేద వ్యాసుడి ఆలయం జలమయమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు ఎటూ వెళ్లలేక బాసరలోనే ఉండి పోవాల్సి వచ్చింది. కొన్ని ప్రైవేటు లాడ్జీలు కొంత మేర జలమయమయ్యాయి. పక్కనే ఉన్న భవనాల్లో అద్దెకు ఉంటున్న 40 మందిని ఎస్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల దగ్గరుండి సమీక్షించారు. బాసర మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు. మూడు రోజుల నుంచి బాసర జలదిగ్భందంలో ఉండగా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
భద్రాచలంలో పెరుగుతున్న వరద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శనివారం రెండో ప్రమాద హెచ్చరికకు మూడు అడుగుల దూరంలో నీటి ప్రవాహం ఉన్నది. సాయంత్రం 6 గంటలకు గోదావరి నిలకడగా ప్రవహిస్తున్నది. ఎగువన పేరూరు వద్ద వరద ప్రవాహం నిదానంగా ఉండటం.. శ్రీరాంసాగర్, ఇంద్రావతి ప్రాజెక్టుల్లో వరద కూడా తగ్గడంతో గోదావరి వరద ప్రవాహం కొంతమేరకు పెరిగి నిలకడగా ఉండొచ్చని సీడబ్ల్యూసీ, ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం వద్ద స్నానాలఘాట్ నీటమునగగా.. కల్యాణ కట్టను ఆనుకుని గోదావరి ప్రవహిస్తున్నది. కాగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి వరద పుష్కరఘాట్ మెట్లను తాకుతున్నది. దీంతో ఘాట్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీటమునిగాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 16.750 మీటర్లు (54 అడుగులు) ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. మండలంలోని టేకులగూడెం గ్రామశివారులోని రేగుమాగు వద్ద ఉన్న హైదరాబాద్-భూపాలపట్నం 163వ జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.