హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు రోజులుగా 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. మరో రెండు రోజులపాటు అదేస్థాయిలో ఇన్‌ఫ్లోలు కొనసాగే అవకాశమున్నదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. అటు గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, పార్వతి, సర్వస్వతి బరాజ్‌లకు సైతం వరద తగ్గిపోయింది. కేవలం మేడిగడ్డ, సమ్మక్క బరాజ్ వద్ద మాత్రమే కొద్దిపాటి వరద కొనసాగుతున్నది.
కడెం ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఇంజినీరింగ్ ఇన్ ఛీప్ (ఈఎన్సీ) ఆపరేషన్ మెయింటనెన్స్ (ఓ అండ్ఎం) మెకానికల్ సభ్యులు సందర్శించారు. క్రస్టుగేట్లు, ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు క్రస్టుగేట్ల కౌంటర్ వెయిట్లు తెగిపోవడం, గేట్ల నుంచి వరద నీరు పారడంతో మిషన్ వ్యవస్థ పాడవడం, విద్యు త్తు సమస్యతో వరదను దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందంలో ఈఈ విద్యానంద్, డీఈ కరుణాకర్, జేఈ సంగీత్, రిటైర్డ్ అధికారి సురేందర్‌తోపాటు స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు.