పెద్దపల్లి, మార్చి 24(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనేది పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆర్ఎస్పై ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును ఎండబెట్టిందని విమర్శించారు. మైనర్ రిపేర్లు చేపట్టకుండా ప్రభుత్వం ఇటు రైతన్నలు, అటు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో రామగుండం, మంథని, మంచిర్యాల, చెన్నూరు గోదావరి తీరం నాడు నిండుకుండలా ఉండేదని, అలాంటి గోదావరి కాంగ్రెస్ కుట్రతో నేడు ఎడారిగా మారిందని అన్నారు. గోదావరిని ఎండబెట్టి రైతుల కన్నీళ్లకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని అన్నారు. కాళేశ్వరం విషయంలో పెద్ద తప్పు చేసిన రేవంత్‌రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.