వంద కిలోల బరువు మోసే ఒక వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం గతంలో కనీసంగా 50 కిలోల బరువు మోసే వారిని ఎంపిక చేయాల్సి ఉన్నది. కానీ, సెలెక్టర్లు 22 కిలోల బరువు ఎత్తినోళ్లయితే సరిపోతుందని చెప్తున్నారు. 30.. 40.. 150 కిలోల బరువు ఎత్తినవారు వచ్చినా సరే! కుదరదు.. కచ్చితంగా 22 కిలోలు ఎత్తిన అనుభవం ఉన్నవాళ్లే కావాలంటున్నారు. అంటే… వాళ్ల దృష్టిలో ఎవరో 22 కిలోల బరువును ఎత్తిన వ్యక్తి ఉండి ఉండాలి. ఆయన కోసమే వాళ్లు నిబంధనలను అమలు చేశారన్నమాట. జలమండలి ఇటీవల పిలిచిన గోదావరి మంచినీటి పథకంలోని టెండర్ల తీరు ఇట్లనే ఉన్నది.
-గుండాల కృష్ణ, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి
Congress Govt | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి… అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడం తీవ్ర ఆరోపణలకు తావిస్తున్నది. జీవో 94 ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఆ డాక్యుమెంట్లలోనే స్పష్టంగా పేర్కొని… ఆ జీవోకే తూట్లు పొడిచి అర్హత ప్రమాణాలను నిర్ధారించడమంటే ‘ఎవరి కోసం ఈ ఉల్లంఘనలు?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారులు రూ.5,383 కోట్ల ప్రాజెక్టును కేవలం రెండు ప్యాకేజీలుగా విభజించడమే కాకుండా.. పైపులైన్లు, శుద్ధికేంద్రాలు, రిజర్వాయర్లు, విద్యుత్తు సబ్స్టేషన్లు.. ఇలా అన్నిరకాల పనులను ఒక ప్యాకేజీలోనే కుక్కారు. ఒక్కోదానికి ఒక్కో రీతిలో అర్హతలను నిర్ధారించడమే కాదు… అసలు రెండు ప్యాకేజీల్లో ఒకే రకమైన పనులకు సైతం వేర్వేరు అర్హత ప్రమాణాలను పొందుపరచడమేంటో అధికారులకే తెలియాలి.
చివరకు ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం పనులను చేసినవారు కూడా ఈ టెండర్లలో సాంకేతిక అర్హత సాధించే అవకాశాలు లేకుండా మెలిక పెట్టడంతో కనీస పోటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ ముగిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాల కోసం కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం జలాలను తరలించేందుకు గోదావరి మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. కేవలం 26 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ పరిధిలోని సంగారెడ్డి కాల్వ ద్వారా పుష్కలమైన గోదావరి జలాల తరలింపునకు అవకాశం ఉంది. ఆ మేరకే కేసీఆర్ ప్రభుత్వం 10 టీఎంసీల గోదావరి జలాల తరలింపు పథకాన్ని రూ.1,006 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా వ్యాప్కోస్ నివేదిక ఆధారంగానే గత ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి జలాల తరలింపునకు నిర్ణయించడం గమనార్హం. తక్కువ వ్యయంతో, సమీపంలోని నీటివనరు కాకుండా రెట్టింపు దూరంలో ఉన్న మల్లన్నసాగర్ నుంచి ఏకంగా 20 టీఎంసీల జలాల తరలింపునకు నిర్ణయించింది. ఇందులో 15 టీఎంసీలు నగర మంచినీటి అవసరాలకు వినియోగించి, మిగిలిన ఐదు టీఎంసీలను మూసీ ప్రక్షాళనకు గాను జంట జలాశయాలకు తరలించేలా రూ.7,360 కోట్లతో డిజైన్ చేశారు. దీంతో డిజైన్ మార్పుతో అదనపు పైపులైన్ నిర్మాణంతో పాటు భూసేకరణ కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.3-4 వేల కోట్ల మేర భారం పెరిగిందే తప్ప అదనపు ప్రయోజనం లేకుండాపోయింది.
ఏ ప్రాతిపదికన అర్హతల నిర్ధారణ?
జలమండలి అధికారులు భూసేకరణకు పోను మిగిలిన రూ.5,383.17 కోట్ల పనులను కేవలం రెండు ప్యాకేజీలుగానే విభజించారు. ఇందులో మొదటి ప్యాకేజీని రూ.3,225.47 కోట్లు (అదనంగా రూ.105.48 కోట్లు, పదేండ్ల నిర్వహణ వ్యయం), రెండో ప్యాకేజీని రూ.1992.22 కోట్లు (అదనంగా రూ.60 కోట్లు, పదేండ్ల నిర్వహణ వ్యయం)తో రూపొందించారు. ఈ నేపథ్యంలో జీవో 94 ప్రకారమే టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్న అధికారులు ప్రతి అంశంలోనూ దాన్ని ఉల్లంఘించి అర్హత ప్రమాణాలను నిర్ధారించారు.
జీవో 94, 132 చెబుతున్నది ఇది…
ఏదైనా పనికి టెండర్లు పిలిచినప్పుడు ఆ పని అంచనావ్యయం, పరిమాణం (క్వాంటిటీ)లో కనీసంగా 50 శాతం మేర పనులను గడిచిన ఐదేండ్ల కాలంలోని ఒక ఏడాదిలో చేసి ఉండాలి. అంటే ఉదాహరణకు… వంద కిలోమీటర్ల 3,000 మిల్లీమీటర్ల డయా పైపులైన్ వేసే పనులకు టెండరు పిలిచినప్పుడు గడిచిన పదేండ్లలో ఏదైనా ఒక ఏడాదిలో కనీసంగా 50 కిలోమీటర్ల పని చేసిన అనుభవం ఉండాలి. ఇలా ఏ రకమైన పనైనా సరే పరిమాణంలో సగం మేర గతంలో చేసిన అనుభవం ఉండాలనేది జీవోలో స్పష్టంగా పేర్కొన్న నిబంధన. 2012లో వచ్చిన జీవో 132 ప్రకారం.. జీవో 94లోని ఐదేండ్ల కాలాన్ని పదేండ్ల కాలంగా పొడిగించారు. ఈ నేపథ్యంలో గోదావరి టెండర్లలో అర్హత ప్రమాణాల తీరు ఎలా ఉందో మీరే చూడండి.బీవోక్యూ (బిల్ ఆఫ్ క్వాంటిటీ)లో ఆయా పనుల పరిమాణాలు… అధికారులు నిర్ధారించిన అర్హత ప్రమాణాలు సుమారుగా 50 శాతం వరకు ఉండాలనేది నిబంధన. కానీ, గోదావరి టెండర్లలో నిర్ధారించిన అర్హత ప్రమాణాల తీరు (శాతాల్లో) ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. (గడిచిన ప్రతి పది సంవత్సరాల్లో ఒక ఏడాదిలో అర్హత ప్రమాణాల పరిమాణంలో పని చేయాల్సి ఉంటుందని నిబంధన విధించారు)
ఇదేం చిత్రమో?!
అధికారులు నిర్ధారించిన అర్హత ప్రమాణాలు చిత్ర విచిత్రంగా ఉండటం ఇంజినీరింగ్ నిపుణులను సైతం నివ్వెరపరుస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించడం ఒకెత్తయితే.. కచ్చితంగా ఇంత పని మాత్రమే చేసి ఉండాలని చెప్పడం ఎక్కడా లేదంటున్నారు. ముఖ్యంగా పంపింగ్ మెయిన్స్‌ను పరిశీలిస్తే… 39 కిలోమీటర్లు వేయాల్సిన 2400 ఎంఎం డయా, మరో ఐదున్నర కిలోమీటర్లు వేయాల్సిన 1500, 1200 ఎంఎం డయాకు సంబంధించి అసలు అర్హత ప్రమాణాలే టెండరు డాక్యుమెంట్లో లేకపోవడం మరో విడ్డూరం. అంటే ‘ఆ కొందరు’ గతంలో ఆ పనులు చేయలేదోమో! అని ఓ ఇంజినీర్ చురకలంటించారు.
పని నాణ్యత, ఎక్కువ పోటీ ఉండేందుకు ఆయిల్ కంపెనీల వంటి కీలకమైన టెండర్లలోనూ పైప్‌లైన్ వ్యాసం (మీటర్లలో), దూరాన్ని (కి.మీ) పరిగణనలోకి తీసుకునేందుకు ఓ విధానాన్ని పాటిస్తారు.
ఈ క్రమంలో ఉదాహరణకు ఈ టెండర్లలో రెండు సంవత్సరాల్లో 3000 మి.మీ డయా పైప్‌లైన్‌ను 102.59 వంద కిలోమీటర్లు వేయాల్సి ఉన్నందున మొత్తం పని 307.77 (3*102.59) అవుతుంది. ఏడాదిలో అంటే అందులో సగం 153.88 అర్హత ప్రమాణం అవుతుంది. దీని వల్ల 4,000 మి.మీ డయా పైపులైను వేసిన అనుభవం ఉన్న కంపెనీలు తక్కువ దూరం వేసినా అర్హత సాధించవచ్చు. ఒకవేళ తక్కువ పరిమాణం 1000 మి.మీ డయా పైపులైన్‌ను 200-300 కి.మీ వేసిన అనుభవం ఉన్న వారికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా పోటీ పెరుగుతుంది. కానీ, అధికారులు మాత్రం సామర్థ్యం ఉన్న అనేక కంపెనీలు సైతం అర్హత సాధించేందుకు వీలు లేకుండా సాంకేతిక మెలికలు పెట్టారు.
పోటీ నివారించేందుకేనా ఈ వ్యూహం?
ఒకటీ అరా కాదు… రూ.5,383 కోట్ల పనుల కోసం పిలిచిన ఈ టెండర్లను తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనే అధికారుల అడుగులపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే.. 12వ తేదీన ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. 18వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. 27న బిడ్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అంటే కాంట్రాక్టు సంస్థలకు 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఇందులోనూ ప్రీ బిడ్ సమావేశంతో బేరీజు వేస్తే కేవలం తొమ్మిది రోజుల సమయంలోనే బిడ్ల దాఖలును పూర్తి చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చాలా కంపెనీలు జాయింట్ వెంచర్ల కోసం సంప్రదించుకునే వెసులుబాటు కూడా లేకుండా త్వరితగతిన పూర్తి చేయడమంటే ఆ కొందరిని దృష్టిలో ఉంచుకొని పోటీ లేకుండా చేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.