హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్కసాగర్ నుంచే చేపట్టేందుకు తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించి పలు డిమాండ్లను ముందుపెట్టింది. అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని, జీసీ రివర్ లింక్‌కు పెద్దమనసుతో అంగీకరించాలని తెలంగాణకు ఎన్‌డబ్ల్యూడీఏ విజ్ఞప్తి చేసింది. జీసీ లింక్ ప్రాజెక్టు ఎక్కడి నుంచి చేపట్టాలనే అంశంపై కొంతకాలంగా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ అనేక సాకేంతిక అంశాలను ఎత్తిచూపుతున్నది. ఈ నేపథ్యంలో జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం కొనసాగింది.
సంస్థ డైరెక్టర్ తరఫున జనరల్ (డీజీ) భోపాల్‌సింగ్, దక్షిణాది విభాగం చీఫ్ ఇంజినీర్ దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు హాజరుకాగా తెలంగాణ నుంచి సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జీ అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్, డీడీ గోదావరి సుబ్రహ్మణ్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభ్యంతరాలు, డిమాండ్లను ఎన్‌డబ్ల్యూడీఏకు రాహుల్ బొజ్జా నివేదించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చంపల్లిలో రిజర్వాయర్ నిర్మాణంతో ఇబ్బందులున్నాయని అధ్యయనంలో తేలినట్టు వెల్లడించారు. 83 మీటర్ల ఎత్తుతో కట్టిన సమ్మక బరాజ్నులో 83-87 మీటర్ల మధ్య నీటిని నిల్వచేసి, వాటిని మాత్రమే జీసీ లింక్‌లో తరలించాలని ప్రతిపాదించారు.
83మీటర్ల దిగువన ఉన్న నీటిని ముట్టుకోరాదని, దీంతో సీతమ్మ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలుపుకొని 158 టీఎంసీల అవసరాలున్నాయని, ఆ హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. జీసీ లింక్ కాలువలు, టన్నెళ్ల నిర్మాణ మార్గంలో రెండు పంటలు పండే భూములున్నాయని, వాటిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవచ్చని, కాబట్టి సమ్మక బరాజ్‌కు చెందిన కన్వేయర్ సిస్టమ్‌నే వాడుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ పూర్తయి నీటివాటాలు, ఆపరేషనల్ ప్రొటోకాల్ తేలిన తర్వాతే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ను జీసీ లింక్‌కు వినియోగించుకోవాలని కేంద్రానికి స్పష్టంచేశారు. జీసీ లింక్ ఎంవోఏపై సంతకాల గురించి తొందరవద్దని సూచించారు. ఛత్తీస్‌గఢ్ వాడుకోని వాటాను జీసీ లింక్‌లో తరలిస్తున్న నేపథ్యంలో ముందుగా ఆ రాష్ట్ర సమ్మతి తీసుకోవాలని, సమ్మక బరాజ్ ఎత్తును 87 మీటర్లకు పెంచుకునేందుకు కాన్సంట్ పొందాలని స్పష్టంచేశారు. తెలంగాణ అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్ వెల్లడించారు. గోదావరి-కావేరి లింక్‌లో 50 శాతం వాటాపై పట్టు సడలించాలని, సాధ్యమైనంత మేర తెలంగాణకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వలకు 431.30కోట్లు
గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం రూ.431.30 కోట్లతో పరిపాలన అనుమతులిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా దీనిద్వారా హుస్నాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 1,06,000 ఎకరాలకు నీరందించాల్సి ఉన్నది. రిజర్వాయర్ నుంచి 47.75 కిలోమీటర్ల ఎడమ కాల్వ నిర్మించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎస్సారెస్పీ- ఇందిరమ్మ వరద కాల్వ ప్యాకేజీ నంబర్7 మిగిలిన పనుల కోసం రూ.431.30 కోట్లు తాజాగా విడుదల చేసింది.