హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం ఎదురొంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఫౌండేషన్ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనున్న అరిసా(ఏఆర్ఐఎస్ఏ) (ఏఐ, రొబొటిక్, ఐవోటీ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్) ల్యాబ్ అత్యవసరమైనదని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు.
దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ వర్సిటీ ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచన చేసి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన ప్రయోగశాలను నెలకొల్పుతున్నందుకు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యను, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. శనివారం ఎస్బీఐ-అరిసా ప్రయోగశాల ప్రీలాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐ సాయంతో వ్యవసాయంలో మాన రహిత వ్యవసాయమే లక్ష్యమని తెలిపారు. వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. వచ్చే 20 ఏండ్లలో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని.. దీంతో ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.