Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారలను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ పీ రాణే, ఏపీ ఎస్పీఎఫ్ డీజీపీ సీఎం త్రివిక్రమ్ వర్మ స్వామివారలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో పెద్దిరాజు, ఏఈవో శ్రీనివాసరావు, అర్చక పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం, జ్ఞాపికను అందించారు. వారి వెంట ఏఈవోలు, శ్రీశైలం వన్ టౌన్ సీఐ ప్రసాద్‌రావు ఉన్నారు.