హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-129ను వెంటనే రద్దు చేసి ఎలాంటి షరతుల్లేకుండా మాజీ వీఆర్వోలను యథావిధిగా రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి హరలే సుధాకర్ హెచ్చరించారు. శుక్రవారం వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, జనరల్ సెక్రటరీ గౌతం కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ హుస్సేనీ ముజీబ్ హాజరై వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు ప్రకటించారు. ఈ నెల 16లోగా జీవోను రద్దు చేయాలని, లేనిచో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ తరఫున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. గోలొండ సతీశ్ మాట్లాడుతూ.. ఎలాంటి పరీక్షలు లేకుండా, విద్యార్హత నిబంధన పెట్టకుండా మాజీ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.