హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన గ్లోబల్ రైస్ సమ్మిట్-2024లో రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు భారత్ సహా ప్రపంచంలోని 30 దేశాలకు చెందిన 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రంలో నిరుడు వరి సాగు విస్తీర్ణం 12 మిలియన్ ఎకరాలు ఉండగా, 26 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని మంత్రులు వివరించారు. స్వాతంత్య్రానంతరం మన దేశంలో బియ్యం ఉత్పత్తి దాదాపు 8 రెట్లు పెరిగి 14 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకున్నదని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 220 రకాల వరి వంగడాలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి వరి సన్నరకాలకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నదని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 30 మిలియన్ల లబ్ధిదారులు ప్రతినెలా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా పొందుతున్నారని వివరించారు. సదస్సులో ఐసీఐ ప్రతినిధి జెరెమీ జ్వింగర్, సలహాదారు అల్దాస్ జానయ్య, ఐఆర్ఈఎఫ్ ప్రెసిడెంట్ ప్రేమ్ గార్గ్, టీఆర్ఈఏ ప్రెసిడెంట్ కృష్ణారావు,పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.