హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న అసంతృప్తి బీసీ నేతల్లో రాజుకుంటున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న పదవుల్లో కొన్ని వర్గాలకే పెద్దపీట వేశారని, ‘అసలు కాంగ్రెస్’ వారికన్నా.. ‘వలస కాంగ్రెస్’కే అందలం దక్కిందన్న అసంతృప్తి కార్యకర్తల్లో నెలకొన్నది. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలు, పలువురు సీనియర్ నేతలు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. పలు సందర్భాల్లో పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు.
తాజాగా శనివారం గాంధీభవన్‌లో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీలోని బీసీలు.. ముఖ్యంగా యాదవులు తమకు పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ లేఖాస్ర్తాన్ని సంధించారు. శుక్రవారం నాడు పీఏసీ కమిటీ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వీ హన్మంతరావు తదితరులకు పార్టీకి చెందిన యాదవ నేతలు లేఖ రాశారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు, మరీ ముఖ్యంగా యాదవులకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు యాదవులు ఎంతో కష్టపడ్డారని, తొలి నుంచి పార్టీకి అండగా ఉన్న యాదవులకు మంత్రి పదవి సహా ముఖ్య పదవులేమీ ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు యాదవ సామాజికవర్గం నుంచి ఇద్దరికి మాత్రమే ప్రభుత్వ పదవులు లభించాయని, కుర్మ సామాజికవర్గానికి చెందిన బీర్ల అయిలయ్యకు విప్ పదవి, ప్రొఫెసర్ యాదయ్యకు టీజీపీఎస్సీ సభ్యుడిగా మాత్రమే అవకాశం ఇచ్చారని, ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, దీనివల్ల యాదవ జాతికి పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. పార్టీలో కూడా తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, పీసీసీ ఉపాధ్యక్షుల్లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చారని, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదుగురు, వెలమ కులం నుంచి ఇద్దరు, ముస్లింలు, మున్నూరు కాపుల నుంచి ముగ్గురేసి ఉన్నారని, కానీ, యాదవుల నుంచి ఒక్కరు కూడా లేరని, జనరల్ సెక్రటరీల్లో 12 మంది రెడ్డీలు, మున్నూరు కాపులు ఏడుగురు, గౌడ్లు ఎనిమిది ఉన్నారని, యాదవుల నుంచి ఒక్కరే ఉన్నట్టు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాదవులకు అన్ని స్థాయిల్లోనూ అవకాశాలు వచ్చాయని, మంత్రి పదవి మొదలు కార్పొరేషన్ పదవుల వరకు అనేకం వచ్చాయని, యాదవుల సంక్షేమానికి కూడా రూ.ఏడు వేల కోట్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించారని, తద్వారా యాదవ జాతికి అనేక ప్రయోజనాలు సమకూరాయని లేఖలో వివరించారు.
శనివారం గాంధీభవన్‌లో జరిగే పీఏసీ సమావేశంలో పార్టీ, ప్రభుత్వ పదవులపై నిర్ణయం తీసుకుంటారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఉంటుందని యాదవ ప్రతినిధులు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే యాదవులకు పదవులు ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనీసం 6-8 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు తమకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదలు కీలక ప్రతినిధులుగా 51 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని యాదవ నేతలు పేర్కొన్నారు. వేం నరేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, శివసేనారెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, కోదందరెడ్డి.. ఇలా అనేకమందిని సలహాదారులుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారని, ఇది సామాజిక సమతుకం అవుతుందా? అని ప్రశ్నించారు. నిన్న మొన్న పార్టీలో చేరిన సీతాదయాకర్‌రెడ్డికి కూడా పదవులు ఇచ్చారని, ‘అసలు కాంగ్రెస్’లో ఉన్న బీసీలను మాత్రం పదవులకు దూరంగా పెట్టారని పేర్కొన్నారు.
ఇక రెడ్డి కులం తర్వాత ప్రభుత్వ, పార్టీ పదవుల్లో అత్యధిక లబ్ధి పొందింది కమ్మ కులం వారని, మొత్తంగా ప్రభుత్వంలోని కీలకమైన 12 పదవులు కమ్మవాళ్లకే ఇచ్చారని, రాష్ట్రంలో కమ్మ, వెలమ కులాల జనాభా ఎంత? వారికి వస్తున్న పదవులెన్ని? అన్నదానిపై పార్టీ అధిష్ఠానం అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, రేణుకాచౌదరికి రాజ్యసభ పదవి, పార్టీ మారి వచ్చిన అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి, గుర్రం మల్సూర్‌కు సీపీఆర్వో పదవి ఇచ్చారని, మన్నె సతీశ్, రాయల నాగేశ్వరరావు, మొవ్వ విజయబాబు వంటివారికి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు.