హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ఇప్పించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లికి చెందిన రైతు చల్లా మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన సమస్యను చెప్పేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోసం సోమవారం సచివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా కలువలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మల్లారెడ్డి మాటల్లో.. ‘నా తండ్రి చల్లా రాంరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం నా తండ్రికి జనగామ జిల్లా జనగామ మండలం పరసమడ్ల గ్రామంలోని సర్వే నంబర్ 140/14లో 2 ఎకరాలు కేటాయించింది. నా తండ్రి మరణించే ముందు ఆ భూమిని వారసుల పేర్ల మీద వీలునామా రాశారు. 2020లో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో వ్యవసాయం చేయడం లేదంటూ మాకు నోటీసు ఇచ్చారు. కొన్నేండ్లుగా బోరు వేసుకొని సాగుచేసుకుంటున్నామని ఆధారాలు చూపించినా పట్టించుకోకుండా స్థలాన్ని ఖాళీగా ఉంచామంటూ పట్టా రద్దు చేశారు. దీనిపై హెకోర్టును ఆశ్రయించగా.. నాలుగు నెలల్లో పరిష్కరించాలని జనగామ కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విషయంపై ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశా. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తవుతున్నా నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. నా దరఖాస్తు ఇప్పటికీ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూమిని ఇప్పించాలి’ అని వేడుకొంటున్నా.