హైదరాబాద్, జూలై12 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకు సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. జలసౌధలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, పరీక్షలు, ఎదురైన అడ్డంకులను ఈఎన్సీ బీ నాగేందర్రావు, రామగుండం ఈఎన్సీ సుధాకర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఆయా సంస్థలకు చెందిన అధికారులు అమితాబ్ మీనా, మనీశ్‌గుప్తా, డాక్టర్ మందిర, సీఈసీడీవో మోహన్‌కుమార్, సీఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అదనపు బాధ్యతలు ఎందుకిచ్చారు..?
ఉద్యోగ విరమణ పొందిన అధికారుల స్థానంలో ఇతర అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారులకు అదనపు బాధ్యతలు ఎలా అప్పగించారో తెలియజేయాలని వివరణ కోరింది. ఈ మేరకు ఈఎన్సీ జనరల్‌కు మెమో జారీ చేసింది.
నెలాఖరున జీఆర్ఎంబీ సమావేశం సీతారామ ప్రాజెక్టు అనుమతులపై చర్చ
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)సమావేశాన్ని ఈ నెలాఖరున నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇరు రాష్ర్టాలకు బోర్డు సమాచారం అందించింది. ఇటీవలే సీతారామ లిఫ్టుకు సంబంధించిన డీపీఆర్‌ను జీఆర్ఎంబీకి సీడబ్ల్యూసీ పంపించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్‌పై ఇరు రాష్ర్టాలతో చర్చించేందుకు ఈ నెలాఖరున సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.