హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ -మలాజిగిరి జిల్లా, దుండిగల్ -గండిమైసమ్మ మండలం, బౌరంపేటలో కోట్లాది రూపాయల విలువైన పదెకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ప్రైవేటు నిర్మాణ సంస్థ ఆక్రమణలకు పాల్పడుతున్నదనే అభియోగాల నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలు కూడా అందజేయాలని ఆదేశించింది. బౌరంపేటలోని సర్వే నం.166లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని వజ్ర బిల్డర్లు, ఇతర ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి అక్రమంగా లేఔట్ వేస్తుంటే అధికారులు పట్టించకోలేదని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాఘవరావు అనే వ్యక్తికి ఉన్న 10 ఎకరాలకు సర్వే నెం.166లో సబ్ నంబర్లు వేసి విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపించారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదన చేస్తూ, ఆ భూముల్లో 80 మంది దాకా ఉన్నారని, వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సివున్నదని, వివరాలు తెలుసుకుని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో విచారణ జూలై రెండో తేదీకి వాయిదా పడింది.