హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల్లో పట్టుబడిన ఎర్రచందనం ఏపీదే అయినందున వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తూ వివిధ రాష్ర్టాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చే సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీశాఖ, ఇతర రాష్ర్టాల అటవీశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ర్టాల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనున్నది.