MLA Parnika Reddy | మరికల్, సెప్టెంబర్ 26 : ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చి.. గవర్నమెంట్ మారంగానే ప్రస్తుతం ఎందుకు విద్యుత్తు సరఫరాలో కోతలు పెడుతున్నారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీపై వెళ్లండి’ అంటూ విద్యుత్తు అధికారులపై నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్హాల్లో మరికల్, ధన్వాడ మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఎమ్మెల్యే హాజరయ్యారు. గత ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిందని, ప్రభుత్వం మారగానే అవి ఎందుకు ఇవ్వడం లేదో వివరించాలన్నారు. కరెంట్ రావడం లేదన్నవాళ్లు చేతులు ఎత్తండని ఎమ్మెల్యే సూచించగా అక్కడున్న పలువురితోపాటు ఎమ్మెల్యే చేయి పైకెత్తి విద్యుత్తు శాఖ పనితీరును ఎండగట్టారు.